దాడి పాశవికం

13 Jan, 2014 04:33 IST|Sakshi
దాడి పాశవికం
  •     నిందితులను కఠినంగా శిక్షిస్తాం..
  •      సబిత, మంత్రి ప్రసాద్‌కుమార్‌ల హామీ
  •      పాస్టర్ సంజీవులుకు పరామర్శ
  •      దాడికి సర్కార్‌దే బాధ్యతన్న బ్రదర్ అనిల్  
  •  
     చాదర్‌ఘాట్,కవాడిగూడ,న్యూస్‌లైన్: గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులును ఆదివారం చేనేత,జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్,మాజీహోంమంత్రి సబితారెడ్డి, మహా జన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం మంత్రి ప్రసాద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ పాస్టర్‌పై దాడి అత్యంత పాశవికమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని సూచించారు. పాస్టర్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, దాడికి పాల్పడిన దోషులను ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద సంజీవులు వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీఇచ్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. మందకృష్ణ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల విషయంలో బీజేపీ తమ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్‌పై దాడి అత్యంత దారుణమంటూ..ఈ విషయమై డీజీపీ,సీఎంను కలుస్తానని చెప్పారు.
     
    దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత: బ్రదర్ అనిల్‌కుమార్

    క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రముఖ మతప్రబోధకులు బ్రదర్ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్‌పైనున్న గుర్రంజాషువా, అంబేద్కర్ విగ్రహాల వద్ద క్రిస్టియన్ సోషల్‌ఫోరం, ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి బ్రదర్ అనిల్‌కుమార్, సినీహీరో రాజా హాజరయ్యారు.

    బ్రదర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంజీవులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు పాల్‌దేవ్‌ప్రియం, బిషప్‌విల్స న్ సింగన్, స్టాలిన్‌బాబు, పి.వరప్రసాదరావు, మాజీ ఐఏఎస్ దానం, బిషప్ గొల్లపల్లిజాన్, టీఆర్‌ఎస్ క్రిస్టియన్ సెల్ ఇంచార్జ్ బి.శంకర్‌లూక్, టీడీపీ క్రిస్టియన్‌సెల్ ఇంచార్జ్ చిరంజీవి, ఎస్తేరురాణి, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.  
     

మరిన్ని వార్తలు