ఒకటే స్కెచ్

30 Sep, 2013 04:21 IST|Sakshi

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఐదున్నరేళ్ల వ్యవధిలో నగరంలో రెండు భారీ విధ్వంసాలను సృష్టించింది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబుల్ని పేల్చి 47 మంది ప్రాణాలు తీసింది. మరో 300 మందిని క్షతగాత్రుల్ని చేసింది. సుదీర్ఘ విరామం తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న మరోసారి విరుచుకుపడిన ముష్కరులు 18 మందిని చంపి, 131 మందిని క్షతగాత్రుల్ని చేశారు. ఈ రెండు పేలుళ్ల ఆపరేషన్ల మధ్య ఉన్న సారూప్యతలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...    
 
గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ విధ్వంసాల కోసం ముష్కరులు 25 రోజుల ముందు నగరానికి చేరుకోగా... ఈసారి మాత్రం కేవలం 16 రోజుల ముందే వచ్చారు. అప్పట్లో తొలుత అనీఖ్ షఫీఖ్ సయీద్ (లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టాడు) అనే ఉగ్రవాది వచ్చాడు. షెల్డర్ ఏర్పాటు చేశాక అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఇతడు పెట్టిన బాంబు పేలలేదు)ని పిలించించాడు. ఇద్దరూ కలిసి ప్రాథమిక రెక్కీలు పూర్తి చేసిన తరవాత పేలుడుకు రెండు రోజుల ముందు మాత్రమే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన రియాజ్ భత్కల్ (గోకుల్‌చాట్‌లో పెట్టింది ఇతడే) చేరుకుని బాంబుల పని పూర్తి చేశాడు. ఆ తరవాత ఒక రోజు తమ గదిలోనే ఉండి తిరిగి వెళ్లారు. తాజా దిల్‌సుఖ్‌నగర్ ఆపరేషన్ కోసం మొదట తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టిన వ్యక్తి) రాగా... కొన్ని రోజులకు తబ్రేజ్, వఖాస్ (107 బస్టాప్‌లో పెట్టిన వ్యక్తి) వచ్చారు. ఈ ముగ్గురూ కలిసి రెండు పేలుళ్లు జరిపి వెళ్లారు.
 
 మంగుళూరు నుంచే ‘పార్సిల్స్’
 
 అప్పటి, ఇప్పటి జంట పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం, డిటోనేటర్లు ఉగ్రవాదులు నగరానికి చేరుకున్న తరవాతే వారికి అందాయి. 2007లో విధ్వంసం సృష్టించడానికి పదిహేను రోజుల ముందు మంగుళూరు నుంచి రియాజ్ భత్కల్ పేలుడు పదార్థంతో పాటు ఇతర ఉపకరణాలను ఓ బస్సు ద్వారా పంపాడు. వీటిని అనీఖ్, అక్బర్‌లు చాదర్‌ఘాట్‌లో రిసీవ్ చేసుకున్నారు. ఈసారి మాత్రం తబ్రేజ్ నేరుగా మంగుళూరు నుంచి తీసుకువచ్చాడు. ఇతడిని మోను ఎల్బీనగర్ చౌరస్తాలో రిసీవ్ చేసుకుని తమ డెన్‌కు వెంటపెట్టుకు వెళ్లాడు. నాడు చెక్కతో చేసిన షేప్డ్ బాంబుల్ని పేల్చగా... నేడు ప్రెషర్ కుక్కర్లతో తయారు చేసిన బాంబుల్ని పేల్చారు. రెండు సందర్భాల్లోనూ పేలుడు పదార్థంగా అమ్మోనియం నైట్రేట్‌నే వినియోగించారు.
 
 కామన్ ‘పాయింట్’ దిల్‌సుఖ్‌నగర్
 
 2007 నాటి గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల ఆపరేషన్, ఈ ఏడాది ఫిబ్రవరి నాటి ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన విధ్వంసం... ఈ రెండు అంశాల్లోనూ దిల్‌సుఖ్‌నగర్ కామన్ పాయింట్‌గా ఉంది. అప్పట్లో గోకుల్‌చాట్‌లో రియాజ్, లుంబినీపార్క్‌లో అనీఖ్ బాంబులు పెట్టగా... అక్బర్ మరో బాంబును దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ వద్ద వదిలి వెళ్లాడు. ఆ రెండూ పేలగా... ఇది పేలలేదు. ఫిబ్రవరి ఆపరేషన్‌లో మాత్రం ఉగ్రవాదులు నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేసి రెండు బాంబుల్ని పేల్చారు. ఈ రెండు ఉదంతాలపై నమోదైన ఐదు కేసుల్లోనూ రియాజ్ భత్కల్ ప్రధాన నిందితుడిగా, మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అప్పట్లో నేరుగా వచ్చి హబ్సిగూడలోని గదిలో బాంబుల్ని అసెంబుల్ చేసి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... ఈసారి మాత్రం పాకిస్థాన్ నుంచి నేతృత్వం వహించి చేయించాడు. బాంబుల అసెంబ్లింగ్ బాధ్యతల్ని వఖాస్‌కు అప్పగించాడు.
 
 రెండుసార్లూ మారిన ‘టార్గెట్స్’...
 
 ఈ రెండు ఆపరేషన్లలోనూ ఉగ్రవాదులు ఆఖరి నిమిషంలో అనుకోని ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని బాంబు పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఉగ్రవాదులు టార్గెట్ చేసిన ప్రాంతాల్లో గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు హుస్సేన్‌సాగర్‌లో తిరిగే షికారు బోటు ఉంది. అయితే ఇందులో బాంటు పెట్టేందుకు ట్రిగ్గర్ ఆన్ చేసుకుని ఆటోలో వెళ్లిన అనీఖ్... ఆటోవాలాకు చెల్లించేందుకు అవసరమైన చిల్లర లేకపోవడంతో బాంబు పేలే సమయం సమీపించి లుంబినీపార్క్ లేజేరియం వద్ద వదిలి వెళ్లాడు. ఫిబ్రవరి 21న సైతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్‌తో పాటు దాని వెనుక ఉన్న ఓ మద్యం దుకాణాన్ని టార్గెట్ చేశారు. అయితే అక్కడకు బాంబుతో కూడిన సైకిల్‌ను తీసుకువెళ్తున్న వఖాస్ సమయం మించిపోతుండటంతో 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెనక్కు వెళ్లిపోయాడు.
 
 అనుమానం రాని చోట మకాం

 సిటీని టార్గెట్‌గా చేసుకుని విధ్వంసం సృష్టించడానికి నిర్ణీత సమయం ముందు వచ్చిన ఐఎం ఉగ్రవాదులు పోలీసుల ఆలోచన సోకని, వారికి అనుమానం రాని ప్రాంతాల్లోనే షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నాటి జంట పేలుళ్ల కోసం నగరానికి వచ్చిన ఉగ్రవాదులు హబ్సిగూడలోని స్ట్రీట్ నెం.8లో ఉన్న బంజారా నిలయం అపార్ట్‌మెంట్‌లోని 302 ఫ్లాట్‌ను ఎంచుకుంటే... తాజాగా దిల్‌సుఖ్‌నగర్ ఆపరేషన్ పూర్తి చేయడం కోసం వచ్చిన వారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సాయినగర్‌లో ఉన్న రేకుల ఇంటిలో ఆశ్రయం పొందారు. ఈ రెండు సందర్భాల్లోనూ విద్యార్థులమంటూనే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. రెండు ఇళ్ల యజమానులూ వాటికి సమీపంలో లేకపోవడం వీరికి కలిసి వచ్చింది.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా