పోలీసుల అదుపులో సినార్‌వ్యాలీ కేసు నిందితుడు

13 Jun, 2016 17:50 IST|Sakshi

 కిటికి గ్రిల్స్ తొలగించి భారీ దొంగతనాలకు పాల్పడుతూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులకు మూడేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న గజ దొంగ ఎట్టకేలకు నల్లగొండ పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో సంచలనం సృష్టించిన పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా తేలింది. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకొని రెండు రోజుల నుంచి విచారిస్తున్నట్లు సమాచారం.

 

వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన సతీష్(27) గత ఏప్రిల్ 28వ తేదీన ఫిలింనగర్ సమీపంలోని సినార్‌వ్యాలీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్‌ఎస్.శర్మ నివాసంలోకి చొరబడి రూ.కోటి విలువ చేసే ఆభరణాలతోపాటు రూ.5 లక్షల నగదు తస్కరించాడు. ఇందులో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతూనే నల్లగొండలో ఓ కారును ఎత్తుకుపోయాడు. అయితే, అందులో అతడు వదిలిపెట్టిన చిన్న స్లిప్‌తో పోలీసులు అతడిని పట్టుకోగలిగారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 దొంగతనం కేసుల్లో నిందితుడని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

చదివింది నాలుగో తరగతే..
సతీష్ చదివింది నాలుగో తరగతి. చోరీ సొత్తును వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఆ సొమ్ముతో జల్సాలకు పాల్పడుతున్నట్లు తేలింది. పటాన్‌చెరువులో భూములు కొనుగోలు చేసినట్లు తె లుస్తోంది. విచారణలో మరిన్ని దొంగతనాల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలడంతో క్రైం పోలీసులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

 

మరిన్ని వార్తలు