సాహితీ చిరంజీవి

13 Jun, 2017 02:52 IST|Sakshi
సాహితీ చిరంజీవి
మారుమూల పల్లె నుంచి కవితా ప్రపంచపు అంచులదాకా..
- ఏడు దశాబ్దాలపాటు కురిసిన సాహిత్య మేఘం సినారె 
భావంలో తేనెలు.. భాషలో పరిమళాలు
 
సాక్షి, హైదరాబాద్‌: 
ఎన్నెన్ని ప్రస్థానాలు మనిషికి 
ఎన్నెన్ని పరిభ్రమణాలు మనిషికి
అంతలోనే నురగల పరుగు అంతలోనే కదలని అడుగు
ఎవరు తాను ఏ ధాతు గర్భం నుంచి ఎదిగిన మాను
ఎలా కుదించుకున్నాయో 
ఇంత మొలకలో అంతటి శాఖలు
ఎలా పొదుగుకున్నాయో 
ఇంత విత్తులో అంతటి జీవరేఖలు 
(..‘విశ్వంభర’ నుంచి)
 
తెలంగాణలో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజీపేట గ్రామంలో సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించారు. అది శిష్ట భాష వాసన లేని ఊరు. నిజాం జమానా కాబట్టి ఉర్దూ మాధ్యమంలోనే చదవాల్సిన పరిస్థితి. ఈ రెండు పరిమితులను అధిగమించి ఆయన ఉర్దూ, తెలు గు రెండింటా అద్భుతమైన భాషాజ్ఞానం సంపాదించా రు. కౌమారంలోనే కవితా సాధన ప్రారంభించారు. రోచి స్, సింహేంద్ర పేరుతో కవితలు రాసేవారు. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు వంటి సాంఘిక నాటకాలు రచించారు. కోస్తా, రాయలసీమ కవులూ సినారె నోట్లో ఇంత తెలుగు ఉందా అని ఆశ్చర్యపోయేలా చేశారు. అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, భావ కవిత్వం, అమూర్త కవిత్వం... ఇలా ఆయన కవిత్వం విడి పాయలు గా ఉండదు. ఈ అన్ని అంశలూ ఆయనలో ఉంటాయి.

స్థూలంగా ప్రగతిశీల మానవీయ కవి. ఆయన కవిత్వం లో కరుణవీరం ఉంటుంది. ఈ విషయంలో ఆయన జాషువా లాంటివాడు. మార్పు కోసం వీరం. మానవ త్వం కోసం కరుణ. మనిషి–చిలక, భూగోళమంత మనిషి, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కొనగోటి మీద జీవితం లాంటివి ఆయన వెలువరించిన కొన్ని రచనలు. విశ్వంభర కావ్యానికి గానూ 1988లో దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘జ్ఞానపీఠ’ గౌరవం పొందారు. విశ్వనాథ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో తెలుగు కవి అయ్యారు.
 
సినీకవిగా చెరగని ముద్ర
చిగురు చిగురున రాగశీకరములొలికించి
ఆకునాకున మరకతాత్తరులు పలికించి
పూవుపూవున మధువు పులికింతలొనరించి
వచ్చె కుసుమాస్త్ర భాస్వంతము వసంతమ్ము
(‘రుతుచక్రం’ నుంచి)
 
సినిమాల్లోకి ‘సింహద్వారం’ గుండానే ప్రవేశిస్తానని చెప్పిన సినారె అన్నట్టుగానే 1962లో ‘గులేబకావళి కథ’ ద్వారా సింగిల్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ‘మనసు మల్లెపూవై తేలెను’ ఆయన రాసిన మొదటి పాట. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ అదే సినిమాకు రికార్డయిన మొదటి పాట. తర్వాత సుమారు 3000 వరకు పాటలు సరళ సుందరమైన శైలిలో రాశారు. పగలే వెన్నెల జగమే ఊయల (పూజాఫలం), చరణకింకిణులు ఘల్లుఘల్లుమన (చెల్లెలు కాపురం), వస్తాడు నా రాజు ఈ రోజు(అల్లూరి సీతారామరాజు), వటపత్రశాయికి వరహాల లాలి (స్వాతిముత్యం), ఓ ముత్యాలరెమ్మ.. ఓ మురిపాల కొమ్మ (ఒసేయ్‌ రాములమ్మ), గోరంత దీపం కొండంత వెలుగు (గోరంత దీపం), ఎంతటి రసికుడవో తెలిసెరా (వంశవృక్షం) లాంటి పాటల్ని తాను మాత్రమే రాయగలిగేంతటి శబ్ద సౌందర్యంతో తీర్చిదిద్దారు. ఉర్దూపై పట్టుతో గజళ్లనూ, ఖవ్వాలీలను అలవోకగా రాశారు. తెలంగాణ మాండలీకం, పలుకుబడులను కూడా ఆయన పాటల్లో ప్రయోగించారు. ‘ఏకవీర’ సినిమాకు మాటలు రాశారు సినారె. అలా మరో జ్ఞానపీఠ కవి విశ్వనాథ సత్యనారాయణ రచనకు ఈ జ్ఞానపీఠ కవి మాటలు రాసినట్టయింది! సినారె మాటలు రాసిన మరో చిత్రం ‘అక్బర్‌ సలీం అనార్కలి’.
 
పాట.. ఆయనంత హుందాగా..
‘‘శబ్దాలంకారాల్లో అంత్యానుప్రాసను ఇష్టపడేవారు. అర్థాలంకారాల్లో ఉత్తరాలంకారాల్ని ఇష్టపడేవారు. ఈ అలంకారాల మీద మోజుకు కారణం ఆయన అధ్యాపక వృత్తి. భావంలో తేనెలు, భాషలో పరిమళాలు ఆయన ప్రత్యేకత. పాట హుందాతనాన్ని తగ్గించకుండా ఆయనంత హుందాగా నడిపించారు సినారె’’ అంటారు సినీగీతాల పరిశోధకుడు డాక్టర్‌ పైడిపాల. పాటల్లో సూక్తులు, హితోక్తులు చెప్పడం సినారె మరో ప్రత్యేకత. చదువురానివాడవని దిగులు చెందకు(ఆత్మబంధువు), పుట్టినరోజు పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి(జీవన తరంగాలు), కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా (ప్రేమించు)... ఇలా సందర్భోచితంగా జీవితాన్ని తరచిచూసిన తత్వం ఆయన పాటల్లో పలికేది. కంటేనే అమ్మ పాటకు ‘నంది’ అవార్డు అందుకున్నారు. ఆయనకు నంది తెచ్చిన మరో పాట.. ఇదిగో రాయలసీమ గడ్డ.. దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ(సీతయ్య). కర్ణ సినిమాకుగానూ ఆయన రాసిన డబ్బింగ్‌ గీతం ‘గాలికి కులమేది..’ ఒరిజినల్‌కన్నా బాగా వచ్చిందని ప్రశంసలందుకుంది.
 
సానుకూలమే ప్రధానం
ఎన్నిసార్లు నా గదిలో కొచ్చిందో సముద్రం
వచ్చినప్పుడల్లా టేబుల్‌ మీది కాగితాలు నిక్కపొడుచుకుంటాయ్‌
తిరిగిపోతూ అది మిగిల్చిపోయిన నురగలు అచ్చుపడ్డ అక్షరాల్లా మెరుస్తుంటాయ్‌
(‘గదిలో సముద్రం’ నుంచి)
 
ఒక సమయంలో భాగ్యనగరంలో సినారె హాజరు కాని సాహిత్య సభ దాదాపుగా జరగలేదంటే ఆశ్చర్యం లేదు. ఏ సమావేశానికైనా ఆయన ప్రత్యేక ఆకర్షణ. కొత్తగా రాస్తున్నవాళ్ల దగ్గర్నుంచి ఆయనంతటి వయసున్నవాళ్ల దాకా అందరికీ ఆయనే ప్రధాన వక్త. అందుకే సినారె ముందుమాటలు రాసిన కవిత్వ సంకలనాలు కోకొల్లలు! అలాగని అకవిత్వాన్ని కూడా మెచ్చుకునేవారా? ఉన్నదానిలో మార్పులు చేయడం కన్నా, వ్యవస్థలోని సానుకూల అంశాలను ప్రమోట్‌ చేయడానికి ప్రయత్నించడం ఎడ్మినిస్ట్రేటర్‌గా సినారె వ్యవహార శైలి. అదే శైలిని ఆయన కవిత్వ ప్రశంసలోనూ పాటించారు. ‘‘అది లౌక్యంగా కన్నా ఆయన వ్యక్తిత్వంలో భాగంగా చూస్తాను. ఆయనతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ ఏనాడూ ఎవరి గురించీ ఒక ప్రతికూల మాట మాట్లాడగా నేను వినలేదు. ఎంత కొత్తగా రాసేవాడైనా ఆ కవి చేసిన ఒక కొత్త ప్రయోగాన్ని మెచ్చుకునేవారు. శబ్దం పుట్టించే ఉద్దీపన గురించి మాట్లాడేవారు’’ అంటారు ప్రొఫెసర్‌ గంగిశెట్టి లక్ష్మీనారాయణ.
 
ప్రయోగశీలి
నింగిలోతును చూడగోరితే నీటిచుక్కను కలుసుకో
రత్నతత్వం చూడగోరితే రాతిముక్కను కలుసుకో
అణువునడిగితె తెలియదా బ్రహ్మాండమంటే ఏమిటో
మౌనశిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో
మనిషి మూలం చూడగోరితే మట్టిబెడ్డను కలుసుకో
(‘ప్రపంచ పదులు’ నుంచి)
 
సినారె మహా శిఖరం లాంటి కవి. ప్రయోగవాది. అన్ని ప్రక్రియలనూ ముట్టారు. పద్యాలు మాత్రమే ఆదరించే కాలంలో గేయాలు రాశారు. పద్య కావ్యాలు, గేయాలు, వచన కవితలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్రకథలు, గజళ్లు రాశారు. ఏ కాలంలోనైనా తన కాలపు యువకులతో కలిసి నడిచారు. పద్యాల్లోంచి గేయాల్లోంచి వచ్చిన ఆయన.. మనవల వయసు వాళ్లతో పోటీపడ్డారు. వర్తమాన ప్రాసంగికత ఎప్పుడూ పోనీయలేదు.
 
‘తలుపులూ కిటికీలు ఎంతగా మూసుకొనివున్నా తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా’ అని అధిక్షేప కవిత్వం రాశారు. దీన్ని మాత్రాఛందస్సును బట్టి పంచ పదులు అన్నారు. వస్తువును బట్టి ప్రపంచ పదులు అని పిలిచారు. ఆయన ఎంతటి ప్రయోగశీలో పరిశోధకుడిగానూ అంత దిగ్గజం. ఆయన పరిశోధన గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము– సంప్రదాయములు, ప్రయోగములు’ రిఫర్‌ చేయకుండా ఒక్క వ్యాసం కూడా రాయలేమని చెబుతారు విమర్శకులు.
 
ఏడు దశాబ్దాలపాటు కురిసిన సాహిత్య మేఘం సినారె. 86 ఏళ్ల జీవితంలో 70 సంవత్సరాలు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిత రాయని రోజు నాకు ఊపిరాడదని అనేవారు. ‘పోతూ పోతూ రాస్తాను వపువు(శరీరం) వాడేవరకు’ అనేది ఆయన కవిత్వ వ్యక్తిత్వాన్ని పట్టించే నినాదం. ‘‘పాత కీర్తుల మీద బతికేవాళ్లు ఉంటారు. ఆయనకు ఇవ్వాళ్టి కీర్తి ముఖ్యం. ఆయన కవిత్వాన్ని నేను కోట్‌ చేస్తాను, నా కొడుకు కోట్‌ చేస్తాడు, నా మనవడూ చెప్తాడు. నైరంతర సాహిత్య చైతన్యానికి ప్రతీక. ఇట్లాంటివాడు తెలంగాణలో శతాబ్దానికి ఒక్కడు కూడా పుట్టడం కష్టం’’ అంటారు సినారెతో దీర్ఘ సాహచర్యం ఉన్న ప్రొఫెసర్‌ ఎన్‌.గోపి. ప్రతీ పుట్టిన రోజుకు ఒక కవితా సంకలనం తేవాలని నియమంగా పెట్టుకున్న సినారె 2016 జూలైలో కూడా ‘నా రణం మరణం పైనే’ సంకలనం తెచ్చారు. బహుశా ఇంకో నెల ఆగితే మరో సంకలనంతో ఆయన మనల్ని పలకరించేవారేమో! అయినా ఆయనే అన్నారు: ‘అందరిలాగే సామాన్యుణ్ణి. అయినా చిరంజీవుణ్ణి’. తెలుగు సాహిత్యంలో సినారె చిరంజీవి!
 
రాస్తూ రాస్తూ పోతాను 
సిరా ఇంకేవరకు
పోతూ పోతూ రాస్తాను 
వపువు వాడేవరకు
(సినారె కవిత)
 
సినారెకు ప్రముఖుల నివాళి
సాహిత్య ప్రపంచానికి తీరని లోటు..
సినారె మరణం సాహితీ ప్రపంచానికి తీరనిలోటు. ఆయన తన రచనలతో అన్ని తరాల వారిని ఏకం చేశారు. ఈ విచారకర సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల గురించే.
– ప్రధాని నరేంద్ర మోదీ
 
సినారె కృషి ఎన్నటికీ మర్చిపోలేనిది
సాహిత్య రంగంలో సినారె చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది. తెలంగాణ బిడ్డ సినారె కలం నుంచి వచ్చిన అనేక పద్యాలు, గేయాలు, కవితలు, కథలు ఆయనను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయి. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి.
  – సీఎం కేసీఆర్‌
 
ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
జ్ఞానపీఠ్‌ పురస్కారానికే వన్నె తెచ్చిన మహా రచయిత సినారె. మా నాయకుడు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. రచయితగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి.
– ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
 
మహా ధ్రువతార నేల రాలింది..: వైఎస్‌ జగన్‌
‘సినారె మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు సాహితీ రంగంలో ఓ మహా ధ్రువతార నేల రాలింది. మహా రచయితలు, మహాకవులు, మహామనుషుల కోవకు చెందిన సిరారె మరణం తెలుగు జాతికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం డాలర్‌ హిల్స్‌లోని సినారె ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. సినారె కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి, ఆయన పెద్దల్లుడు భాస్కర్‌ రెడ్డిలతో మాట్లాడి వారిని ఓదార్చారు.
 
సాహిత్య రంగానికి రారాజు..
తెలుగు సాహిత్య లోకం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. సాహిత్య రంగానికి సినారె రారాజు.
– కేంద్ర మంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయ
 
ఆయన సేవలు చిరస్మరణీయం
సినారె మృతి సాహితీ లోకానికి తీరని లోటు. సాహిత్య రంగానికి, తెలుగు చలన చిత్ర రంగానికి, విశ్వవిద్యాలయాల భాషా సంఘాలు, సాంస్కృతిక మండళ్ల అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.
– డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తలసాని
 
మార్గదర్శకుడిని కోల్పోయాం
‘సాహిత్య అకాడమీ ఒక మార్గదర్శకుడిని, ఒక శాశ్వత స్నేహితుడిని కోల్పోయింది. గాయపడిన హృదయాలకు ఆయన రచనలు ఓదార్పునిచ్చాయి. బతుకు మీద ఆశ కోల్పోయిన వారికి ఒక భరోసాను కలిగించాయి. సినారె మరణం సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన తన రచనల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు’
– కేంద్ర సాహిత్య అకాడమీ
 
ఎంతో సాన్నిహిత్యం
తెలుగు జాతి ఖ్యాతిని పెంచేందుకు అవిరామ కృషి చేసిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన మరణం తీరని లోటు.
– మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
 
తెలంగాణలో విరిసిన సాహితీ కుసుమం
సినారె మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. తెలంగాణ మాగాణిలో విరిసిన విశిష్ట సాహితీ కుసుమం సినారె. ఆయన అస్తమయం తెలంగాణ తల్లికి తీరని గర్భశోకం
– జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత
 
అక్షరం పొదిగిన శక్తి సినారె
సినారె అక్షరం పొదిగిన శక్తి. మానవాళికి తెలియని ఎన్నో విషయాలను ఆయన అక్షరాలతో చెప్పారు. అక్షరం ఉన్నంత వరకు సినారె ఉంటారు. జానపదం, విప్లవపదం అనే తేడాలు లేకుండా ఆయన రచనలు చేశారు.
– గద్దర్‌
 
పలువురు ప్రముఖుల నివాళి
సినారె మృతి పట్ల బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, పి.మురళీధర్‌రావు, జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్, సినీ రచయిత సుద్దాల ఆశోక్‌ తేజ, కవి, రచయిత ఆచార్య ఎన్‌ గోపి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, లోక్‌సత్తా పార్టీ నేత రామ్‌ దేశ్‌పాండే సంతాపాన్ని తెలిపారు.
 
కారులో గజల్స్‌ పాడేవారు
– డ్రైవర్‌ రాములు
సినారెతో తనది 28 ఏళ్ల అనుబంధమని ఆయన కారు డ్రైవర్‌ రాములు తెలిపారు. ‘‘నేను 1989లో డ్రైవర్‌గా చేరాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు నేనే డ్రైవ్‌ చేస్తున్నా. నన్ను సొంత బిడ్డలా చూసేవారు. కారులో గజల్స్‌ ఆలపించేవారు’’ అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ‘‘ఓసారి రవీంద్రభారతిలో నాటి సీఎం వైఎస్, సినారె కలిశారు. సినారెను చూడగానే వైఎస్‌.. ‘అయ్యా మనమిద్దరం కారు దిగుతూనే ఒకటి సరిచేసుకోవాలి..’ అన్నారు. ఎంటదీ అని సినారె అనగానే.. ‘అదే కవివర్యా... పంచె సర్దుకోవాలిగా..’ అని నవ్వుతూ చెప్పారు. ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. నన్ను అన్నీ అడిగి తెలుసుకొని ఓ తండ్రిలా సలహాలు ఇచ్చేవారు’’ అని పేర్కొన్నారు
 
ఆహారం... ఆహార్యం..!
పాల నురగలాంటి తెల్లటి ధోవతి, సిల్కు లాల్చీ.. తెలుగు వైభవానికి  నిలువెత్త సంతకంలా ఉండేది సినారె ఆహార్యం! జాతీయ, అంతర్జాతీయ వేదికలపై  పంచెకట్టులోనే ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. హైదరాబాద్‌లో చదివే రోజుల్లో నిజాం సంస్కృతి రాజ్యమేలుతోంది. నిజాం నవాబు కు గౌరవ సూచకంగా విద్యార్థులు రూమీ టోపీ ధరించేవారు. ఆ సంస్కృతిని వ్యతిరేకించిన విద్యార్థు లు గాంధీ టోపీ ధరించేవారు. సినారె  కూడా గాంధీ టోపీ ధరించారు. ఇంటర్‌లో చేరింది మొదలు తెలు గు లెక్చరర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించే వరకు సినారె ప్యాంటూ, షర్టే వేసుకొన్నారు. సాహితీ సమావేశాలకు వెళ్లడంతో ఆయన పంచెకట్టు మొదలైంది. ‘పంచె కట్టుకోవడం ఓ కళ. నాకైతే కనీసం పది, పదిహేను నిమిషాల సమయం పడుతుంది. ఎర్ర అంచు పంచెలే ఎంపిక చేసుకుంటాను. ‘రెడ్‌’లో ‘రెడ్డి’ గోచరిస్తుంది కదా. అందుకని...’’ అంటూ తన పంచెకట్టుపై తానే ఛలోక్తులు కూడా వేసుకునేవారు సినారె.
 
భోజన ప్రియుడు..
సినారెకు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ లేవు. కాకపోతే 40 ఏళ్లుగా షుగర్‌ ఉన్నా.. ఎప్పుడూ అదుపులోనే ఉంచుకొనే వారు. మంచి భోజనప్రియుడు. ఎక్కడ ఉన్నా సమయానికి ఆహారం తీసుకునేవారు. చివరి రోజు ఉదయం ఆయన పెద్ద కుమార్తె గంగ చేతుల మీదుగా ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం రాత్రి పప్పు–వైట్‌రైస్‌తో భోజనం చేశారు. ఆదివారం చివరిరోజంతా ఇంట్లో ప్రశాంతంగా గడిపారు. సినారె నడకను బాగా ఇష్టపడేవారు. ‘నడక నా తల్లి..’ అనే కవిత కూడా రాశారు. నాలుగేళ్ల క్రితం సినారెకు కాలు విరిగింది. అప్పట్నుంచి నడక మానేశారు. 
 
పంచెకట్టు భళా..
పంచెకట్టుటలోన ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడపదాటని వాడు
ఎవడయ్యా ఎవడు వాడు
ఇంకెవడయ్యా తెలుగువాడు
 
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఆవకాయ వియోగ మసలే నైపనివాడు
ఎవడయ్యా ఎవడువాడు
ఇంకెవడయ్యా తెలుగువాడు
 
పంచభక్ష్యాలు తన కంచాన మెసలినా
గోంగూర పచ్చడికై గుటక వేసెడివాడు
ఎవడయ్యా ఎవడువాడు
ఇంకెవడయ్యా తెలుగువాడు
– సినారె 
మరిన్ని వార్తలు