2019లో ఒకే ఇంజనీరింగ్‌ పరీక్ష!

22 Jan, 2018 01:52 IST|Sakshi

     ఈ ఏడాదే అమలు చేయాలని భావించినా ఎన్‌టీఏ ఏర్పాటులో జాప్యంతో వాయిదా 

     వచ్చే ఏడాదిలో అమలుపై అభిప్రాయాలు తెలియజేయాలన్న ఏఐసీటీఈ 

     అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన అధికారులు 

     తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీపై తర్జనభర్జన 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే అంశం పై చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. జేఈఈ మెయిన్‌ ద్వారానే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలతోపాటు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని సీట్ల భర్తీకీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా ఓకే పరీక్షపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొంది. మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిశా ఇప్పటికే జేఈఈ మెయిన్‌ మెరిట్‌ ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తుండగా.. తాజాగా కేరళ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు అంగీకారం తెలిపింది. మిగతా రాష్ట్రాలు త్వరలోనే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలోనే(2018–19) ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్రం గతేడాది భావించింది. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు అవసరమైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏర్పాటులో జాప్యం కావడంతో వాయిదా వేసింది. పైగా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశం కావడం, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందునా వచ్చే ఏడాదిలో అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా సేకరించే బాధ్యతను ఏఐసీటీఈకి అప్పగించింది.  దీంతో ఏఐసీటీఈ లేఖలు రాసింది. 

ఎన్‌టీఏ ఆధ్వర్యంలోనే.. 
జాతీయ స్థాయిలో వివిధ పరీక్షలను ప్రస్తుతం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. అయితే ఇతర విద్యా కార్యక్రమాలను కూడా చూస్తున్న సీబీఎస్‌ఈకి వాటి నిర్వహణ సమస్యగా మారుతుండటంతో కేంద్రం ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. ఎన్‌టీఏ ఏర్పాటుకు సంబంధించిన చర్యలపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ వంటి పరీక్షలను 2019 నుంచి ఎన్‌టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది.

ఇక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను కూడా ఎన్‌టీఏ ద్వారానే నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది. దీనిపై ఐఐటీ కౌన్సిల్‌తో చర్చలు జరుపుతోంది. అయితే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటి కోసమే జేఈఈ మెయిన్‌ను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఇక రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లను మాత్రం పలు రాష్ట్రాలు తమ సొంత ప్రవేశ పరీక్షల ద్వారానే భర్తీ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా అదే చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంసెట్‌ అవసరమే లేదన్న భావన ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ అంశమే అప్రస్తుతం అవుతుందన్న భావన నెలకొంది. అయితే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని ఏఐసీటీఈకి తెలియజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు