సింగిల్ హ్యాండ్ స్నాచర్ !

20 May, 2016 06:55 IST|Sakshi
సింగిల్ హ్యాండ్ స్నాచర్ !

తెలివి మీరుతున్న గొలుసు దొంగలు బైక్‌పై ఒంటరిగా సంచరిస్తూనే నేరాలు
పోలీసులకు అనుమానం రాకూడదనే చిలకలగూడ ఉదంతమే  తాజా ఉదాహరణ

 

సిటీబ్యూరో/చిలకలగూడ: నగరంలో స్నాచింగ్స్ నిరోధించడానికి పోలీసులు వేస్తున్న ఎత్తులకు.. స్నాచర్లు పైఎత్తులు వేస్తూ ‘పని’ చేసుకుపోతున్నారు.  చిలకలగూడ ఠాణా పరిధిలో బుధవారం జరిగిన గొలుసు దొంగతనమే దీనికి తాజా ఉదాహరణ.  ఈ స్నాచింగ్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు గురువారం విడుదల చేశారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో 1.38 నిమిషాల నిడివితో నేరం జరిగిన తీరు రికార్డు అయింది. ఒకటిన్నర నిమిషాల్లోనే స్నాచర్ వృద్ధురాలి మెడలోని సొత్తును తెంచుకెళ్లినట్టు ఇందులో స్పష్టంగా కని పిస్తోంది. ఈ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీ సులు వాహనం నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. దీనికోసం సిటీ ఐటీ సెల్ అధికారులు వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు.

 
‘జంట’గా వెళ్తే ఆపుతూ...

స్నాచర్లను కట్టడి చేసే చర్యల్లో భాగంగా నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. దీంతో రహదారులతో పాటు కొన్ని చోట్ల గస్తీలో ఉంటున్న పోలీ సు సిబ్బంది ‘పాత ఉదంతాల’ ఆధారంగా పని చేస్తున్నా రు. స్నాచింగ్ కేసుల్లో నిందితులు హైస్పీడ్ బైకులు వాడ టం, వాహనంపై ఇద్దరు ఉండటం, ఒకరు డ్రైవ్ చేస్తుంటే, మరొకరు గొలుసు లాగడం... వంటివి గుర్తించిన పోలీ సులు హైస్పీడ్ బైక్స్‌తో పాటు కొన్ని ఇతర బైక్స్ ఇద్దరు వెళ్తుంటే ఆపుతున్నారు. కేవలం ఇలాంటి వాహనచోదకుల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్న క్షేత్రస్థాయి పోలీసులు సాధారణ వాహనాలపై సింగిల్‌గా వెళ్లే వారిని పట్టించుకోవట్లేదు. స్నాచింగ్స్ ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే జరుగుతుండటంతో ఆ వేళల పైనే ‘దృష్టిపెట్టారు’.

 
ఈ ఎత్తుకు పై ఎత్తు వేసి...

ఈ విషయాలను పసిగట్టిన ‘చిలకలగూడ స్నాచర్’ పోలీ సుల ఎత్తుకు పై ఎత్తు వేశాడు. ‘సహాయకుడి’తో పని లేకుండా సింగిల్‌గానే రంగంలోకి దిగాడు. హైస్పీడ్ కాని బైక్‌పై సంచరిస్తూ వృద్ధుల్ని టార్గెట్‌గా చేసుకుని పంజా విసిరాడు. వాహనంపై వెళ్తూ స్నాచింగ్ చేయకుండా... టార్గెట్‌ను ఎంచుకున్న తర్వాత వెనక్కు వెళ్లి, వాహనాన్ని కొద్దిదూరంలో ఆపి, వారిని వెంబడిస్తూ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. కేవలం ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో పని పూర్తి చేసుకుపోయాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాకుండా... మిట్ట మధ్యాహ్నం పంజా విసిరాడు. వృద్ధురాలితో స్నాచర్ పెనుగులాడటం, వృద్ధుడు కింద పడిపోవ డం... ఇంత హడావుడి జరుగుతున్నా అక్కడ ఉన్న స్థానికులు పట్టించుకోకపోవడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు