‘సింగిల్ హ్యాండ్ స్నాచర్’..మోసిన్

27 Jun, 2016 18:20 IST|Sakshi

స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, దానిపై హెల్మెట్/మాస్క్‌లతో దూసుకువచ్చే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. దీనికి భిన్నంగా సిటీలో సింగిల్ హ్యాండ్ స్నాచింగ్ సైతం జరిగింది. మధ్య మండలంలోని అబిడ్స్ ఠాణా పరిధిలో గతేడాది ఈ ‘సింగిల్ హ్యాండర్’ పంజా విసిరాడు. ఓ ఆటోను వెంబడిస్తూ వచ్చిన దుండగుడు... అదును చూసి అందులోని ప్రయాణికురాలి మెడలో గొలుసు తెంచుకుపోయాడు. ఎనిమిది నెలలుగా మిస్టరీగా ఉన్న ఈ నేరగాడు మరెవరో కాదు... మహ్మద్ మోసిన్ అలీ షాగా తేలింది. శనివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠాలకు చెందిన నలుగురిలో ఇతడొకడు.

పండిత పుత్ర... మాదిరిగా
నగరానికి చెందిన మహ్మద్ సర్వర్ అలీ షా వత్తిరీత్యా వైద్యుడు. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఈయన కుమారుడే మోసిన్ అలీ షా. చిన్నప్పటి నుంచీ నేరాలు చేస్తుండటంతో కుటుంబానికి దూరమయ్యాడు. కాచిగూడలోని ఛాపెల్ బజార్‌లో ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఓ యువతితో అయిన పరిచయం ప్రేమగా మారింది.

ప్రేయసితో కలిసి జల్సాలు చేయడం కోసం స్నాచింగ్స్ బాటపట్టాడు. ఏడాదిన్నర కాలంలో ఆసిఫ్‌నగర్, హుమాయూన్‌నగర్, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, రాంగోపాల్‌పేట్, చిక్కడపల్లి, చిలకలగూడ, నాంపల్లి, అబిడ్స్, నల్లకుంట, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలో 18 గొలుసు దొంగతనాలు చేశాడు. కొన్ని నేరాలు చేయడానికి కోఠికి చెందిన విద్యార్థి సయ్యద్ జమీల్ హుస్సేన్‌ను వాడుకున్నాడు. అతడికి ఉన్న అవసరాలకు ఆసరాగా చేసుకుని నేరాలు చేసేప్పుడు తన వెంట తిప్పుకున్నాడు.

పక్కా ప్లాన్ తో..
తన అవసరాలకు తగ్గట్టు సిటీలో వరుస స్నాచింగ్స్ చేసిన ఘరానా దొంగ మోసిన్ అలీ పోలీసులకు చిక్కకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వీరు ఓ నేరం చేసిన తర్వాత ఆ సొత్తును సొమ్ము చేసుకునేవాడు. అది ఖర్చయ్యే వరకు మరో స్నాచింగ్ చేసే వాడు కాదు. గతేడాది మేలో అలిషా అనే వ్యక్తి నుంచి చోరీ వాహనమైన నీలి రంగు పల్సర్ ఖరీదు చేశాడు. అబిడ్స్ స్నాచింగ్‌తో పాటు మిగిలినవీ దీని పైనే తిరుగుతూ చేశాడు. కేవలం స్నాచింగ్స్ చేయడానికి మాత్రమే దీన్ని వినియోగించే వాడు. ఇతడి ప్రేయసి కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెను కలవడానికి వెళ్తున్న నేపథ్యంలోనే వివిధ కారణాలు చెప్పి అక్కడి పార్కింగ్ నిర్వాహకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఓ స్నాచింగ్ చేసిన తర్వాత వాహనాన్ని ఆ పార్కింగ్‌లోనే పెట్టి మిగిలిన సమాయాల్లో యాక్టివా వాహనంపై తిరిగేవాడు.

వాట్సాప్ ద్వారా క్రై మ్ అప్‌డేట్స్...
మోసిన్ షాను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ బందం అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో టాస్క్‌ఫోర్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం పోలీసులు అరెస్టు చేసిన దొంగలు, నగరంలో జరుగుతున్న స్నాచింగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉండటం చేసి అవాక్కయ్యారు. ఆరా తీయగా... వార్తల్ని మార్పిడి చేసుకునే ఓ వాట్సాప్ గ్రూప్‌లో తాను సభ్యుడిగా మారానని చెప్పాడు. ఆ గ్రూప్ ద్వారానే పోలీసుల కదలికలు, నగరంలో స్నాచింగ్స్ తీరుతెన్నులు తెలుసుకుంటూ పంజా విసిరేవాడినని వివరించాడు.

మోసిన్ షా తాను స్నాచింగ్ చేసిన మర్నాడు ఈ గ్రూప్‌తో పాటు పత్రికల్నీ క్షుణ్ణంగా పరిశీలించే వాడట. ఎక్కడైనా సీసీ కెమెరాల్లో తన ఫొటో రికార్డు అయిందా? ఆ వివరాలు పోలీసులు గుర్తించారా? తదితర అంశాలు తెలుసుకోవడానికి ఇలా చేసే వాడినని టాస్క్‌ఫోర్స్ విచారణలో బయటపెట్టాడు. అబిడ్స్ ఠాణా పరిధిలో 2015 అక్టోబర్ 29న ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సింగిల్‌గా పంజా విసిరిన ఫుటేజ్ కొన్ని రోజుల తర్వాత బయటకు రావడంతో కాస్తంత ఉలిక్కిపడ్డాడట ఈ ఘరానా స్నాచర్. మోసిన్, జమీల్‌లను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు