'పీఓకేలో అంగుళమైన పాక్‌కు ఇచ్చేదిలేదు'

15 Aug, 2016 12:37 IST|Sakshi
'పీఓకేలో అంగుళమైన పాక్‌కు ఇచ్చేదిలేదు'

హైదరాబాద్‌: పీఓకే (పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌)లో అంగుళం కూడా పాకిస్తాన్‌కు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. దేశానికి కమ్యూనిజం, క్యాపిటలిజం పనికిరావని జాతీయవాదం మనకు వేదం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.


అప్పుడే దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని.. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చాలంటే ప్రతి ఒక్కరు తమతమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. అందరికి అభివృద్ది ఫలాలు అందాలి. స్వతంత్ర భారతంలో మనము భాగస్వామ్యులము అనే భావం అందరికీ కలగాలన్నారు.

పరిపాలనలో పారదర్శకత ఉండాలని ..వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని ఆయన అన్నారు. అట్టడుగున ఉన్నవారికి అభివృద్ధి ఫలాలు అందేవరకు స్వతంత్రానికి, అభివృద్ధికి అర్ధంలేదన్నారు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం అంత్యోదయ విధానాన్ని అమలు చేస్తున్నదని వెంకయ్య పేర్కొన్నారు.

గోవుల పేరుతో దాడులు చేసేవారు హిందువులు కాలేరన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వెంకయ్య హితవు పలికారు. దళితులపై కొన్నిచోట్ల 68ఏళ్ల తర్వాత కూడా దాడులు జరగటం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. ఇది మనందరికీ సవాలు అని... దీన్ని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

మైనారిటీలు, స్త్రీలు, పురుషులు, కులం, మతం, భేదభావం వీడి మనమంతా భారతీయులం అనే భావం కలిగించాలన్నారు. దళితులపై దాడులను రాజకీయం చేయడం, ఓటుబ్యాంకు రాజకీయ దృష్టితో చూడడంవలెనే ఈ పరిస్థితి దాపురించిందని ఈ వైఖిరి మారాలని వెంకయ్య అన్నారు. కాగా పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు