గురుకులాలన్నింటికీ ఒకే పరీక్షా విధానం

13 Apr, 2018 01:40 IST|Sakshi

మంత్రి కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాలన్నింటికీ ఒకే పరీక్షా విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురుకుల విద్యాలయాల పటిష్టతపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల సొసైటీల కార్య దర్శులు, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌. ఆచార్య, విద్యాశాఖ సంచాలకుడు కిషన్, ఇతర అధికారులతో మంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష చేశారు.

మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర గురుకులాలను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని, వాటిని రోల్‌ మోడల్‌గా మార్చేలా చర్యలు తీసు కోవాలన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్‌లలో గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని అన్నారు.   

విద్యార్థులందరికీ హెల్త్‌ కిట్లు..
విద్యార్థులందరికీ హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్లు అందించాలన్నారు. బాలికలకు న్యాప్కిన్స్‌ సరిపడా ఇవ్వాలని, పది నెలలకు కాకుండా 12 నెలలకు సప్లయ్‌ చేయాలన్నారు. ఇక ప్రతి గురుకులంలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ అందుబాటులో ఉంచాలని, ఒక ఏఎన్‌ఎం ఉండాలన్నారు. క్రీడలు, ఆటలు ప్రోత్సహించేందుకు పీఈటీ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి గురుకుల విద్యాలయంలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, డిజిటల్‌ క్లాసులు నిర్వహించాలన్నారు. ఐదు గురుకులాల్లో కల్పించే వసతులు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గురుకులాల ప్రవేశాల్లో కూడా నియోజకవర్గాల్లోని స్థానికులకు కొంత ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలను యూనిట్‌ గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహించాలన్నారు.

మరిన్ని వార్తలు