సినిమాలకూ ‘సింగిల్ విండో’

8 Nov, 2015 04:01 IST|Sakshi
సినిమాలకూ ‘సింగిల్ విండో’

విధానంలో అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సినిమాల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు ఒకేసారి ఇవ్వడం కోసం సింగిల్ విండో విధానాన్ని అనుసరించనున్నట్లు వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో సినీ రంగ ప్రముఖులతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు. సినిమా ప్రారంభం మొదలు, విడుదలయ్యేంత వరకు పలు సమస్యలొస్తున్నాయన్నారు.
 
ఇక నుంచి ఏ ఇబ్బంది రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ సింగిల్‌విండో పద్ధతిని అనుసరిస్తామన్నారు. సినిమా రంగంలో అవార్డుల ప్రదానోత్సవం మూడేళ్లుగా నిలిచిపోయిందని, దానిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. నంది అవార్డుల స్థానంలో కొత్త పురస్కారాలను సీఎం కేసీఆర్ ఆమోదంతో సాధ్యమైనంత తొందరలో అందజేస్తామన్నారు. చిత్ర పరిశ్రమలో పనిచేసే రెండు వేల మంది కింది స్థాయి కార్మికులకు గతంలో మణికొండ ప్రాంతంలో నివాస సముదాయాల కోసం ఇచ్చిన 67 ఎకరాల భూమికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. సినీ పరిశ్రమలో ప్రాంతీయ వివక్ష లేదని, నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా ఎదగడానికి అనుకూలమైన అవకాశాలున్నాయని మంత్రి స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు