‘చెర’వు..

23 Sep, 2016 03:51 IST|Sakshi
‘చెర’వు..

ముంచుతున్నది ఆక్రమణలే..
- వాన నీరు వెళ్లిపోయే దారి లేకే మునుగుతున్న కాలనీలు
- చెరువుల్లో, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలే కారణం
- పలు చోట్ల చెరువులు, కుంటలు మాయం
- చాలా చోట్ల సగానికిపైగా ఆక్రమణల పాలు
- కాసుల కక్కుర్తితో చూసీ చూడనట్లు వదిలేసిన ప్రభుత్వ యంత్రాంగం
 
 సాక్షి, హైదరాబాద్: గట్టిగా వాన పడగానే హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది.. కాలనీలు కాలనీలే నీళ్లలో మునిగిపోతున్నాయి.. మరి దీనికి కారణం భారీ వర్షాలు కురవడం ఒక్కటే కాదు.. అసలు కాలనీల్లోకి నీళ్లు రావడం కూడా కాదు.. నీళ్లుండాల్సిన చెరువుల్లో, నీరు పారాల్సిన చోట కాలనీలు కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు.. ఎవరికి వారు చేతనైన కాడికి చెరువులను చెరబట్టడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. చెరువులను, నాలాలను ఆక్రమించి అపార్ట్‌మెంట్లు, ఇళ్లు కట్టడంతో వాన నీరు వెళ్లే దారి లేకపోవడం పర్యవసానమే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 150కి పైగా అపార్ట్‌మెంట్లు జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణం. అడ్డగోలుగా వెలసిన నిర్మాణాల్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం.. కాసులకు కక్కుర్తి పడి కళ్లు మూసుకోవడంతో ఆక్రమణలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి.

 అడ్డగోలు ఆక్రమణలతోనే..
 తొలినాళ్లలో వర్షాలు కురిసినప్పుడు నీళ్లన్నీ సాఫీగా వెళ్లేందుకు, చెరువులు నిండాక వాటి నుంచి కింద ఉన్న చెరువులకు నీళ్లు వెళ్లేందుకు ఏర్పాట్లు ఉండేవి. కానీ చెరువుల శిఖం భూముల్లో, చెరువుల్లోకి నీరు చేరే, నీరు వెళ్లిపోయే ప్రాంతాల్లో అడ్డగోలుగా ఆక్రమణలు వెలిశాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండాక అక్కడి నుంచి వచ్చే నీరు హుస్సేన్‌సాగర్‌లో కలిసేది. కానీ ఇప్పుడా చెరువుల్లో చాలాభాగం వివిధ నిర్మాణాలు, కాలనీలు వెలిశాయి. దాంతో వర్షం వచ్చినప్పుడు ఆ కాలనీలు మునుగుతున్నాయి.

 ప్రధాన ప్రాంతాల్లోనూ..
 నివాసగృహాలు, వాణిజ్య సముదాయాలే కాక ప్రార్థనా మందిరాలు, పార్కులు వంటివి సైతం చెరువుల ఎఫ్‌టీఎల్ (చెరువులో పూర్తిస్థాయిలో నీరు చేరినప్పుడు మునిగిపోయే భూమి) పరిధిలో, చెరువుల్లోనే వెలియడం గమనార్హం. ఒకప్పుడు దుర్గం చెరువులో భాగంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు పలు వాణిజ్య నిర్మాణాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. హైటెక్‌సిటీలోని నెక్టార్ గార్డెన్‌లో బహుళ అంతస్తులు, విల్లాలు, స్విమ్మింగ్‌పూల్, జిమ్ వంటివి ఉన్న ప్రాంతం దుర్గం చెరువులో భాగంగా ఉండేది. ఇక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ సైతం తమ్మిడికుంట బఫర్‌జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారుల పరిశీలనలోనే తేలింది. మల్కాజిగిరి రైతుబజార్ సైతం ముక్కిడిచెరువు ఎఫ్‌టీఎల్ లో ఉన్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైం ది. హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో సైతం దాదా పు 300 ఎకరాల్లో నిర్మాణాలు వెలిసినట్లు అంచనా.

 క్రమబద్ధీకరణల కారణంగా..
 ఇక కాసుల కోసమే క్రమబద్ధీకరణ పథకాలు తెచ్చి సక్రమమైనవిగా మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమణల క్రమబద్ధీకరణ ఆశతోనే ఏడాదికేడాది ఆక్రమణలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లోనూ చాలా వరకు చెరువుల్లో, ఎఫ్‌టీఎల్ పరిధిలోవి కావడం గమనార్హం.
 
 ఒక్క బాలానగర్ మండలం పరిధిలోని చెరువులను పరిశీలిస్తే కబ్జాలు,ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో  అర్థమవుతుంది
► అలీతలాబ్ (హైదర్‌నగర్) చెరువు 17 ఎకరాలు ఉండేది.. ఇప్పుడు 10 ఎకరాలకు పరిమితమైంది. ఠి కింది కుంట (హైదర్‌నగర్) 18 ఎకరాల నుంచి 6 ఎకరాలకు తగ్గింది.
► అంబీర్‌చెరువు (ప్రగతినగర్) 156 ఎకరాలుండేది.. కూకట్‌పల్లి, ప్రగతినగర్, నిజాంపేట, శంషీగూడల పరివాహాక ప్రాంతం కలిగిన ఈ చెరువులో అన్ని వైపులా బహుళ అంతస్తుల భవనాలు, లే అవుట్లు వెలియడంతో సుమారు వంద ఎకరాలు మిగిలింది.
► భీమునికుంట (హెచ్‌ఎంటీ శాతవాహన నగర్) 10 ఎకరాలుండేది. నలువైపులా కాలనీలు ఏర్పడటంతో కుచించుకుపోరుు సుమారు 6 ఎకరాలకు పరిమితమైంది.
► ఎల్లమ్మ చెరువు (ఎల్లమ్మబండ) 46 ఎకరాలు ఉండాల్సింది.. కబ్జాలు, వెంచర్లతో కుచించుకుపోరుు ఇప్పుడు సుమారు 30 ఎకరాలే ఉంది.
► నల్లచెరువు (కూకట్‌పల్లి) విస్తీర్ణం 50 ఎకరాలు. చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు చొచ్చుకువచ్చి 25 ఎకరాలు మిగిలింది.
► ఖాజాకుంట విస్తీర్ణం (మెట్రో వెనకాల) 20 ఎకరాలు. ఆక్రమణలకుతోడు ప్రభుత్వం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించగా.. తాజాగా 5 ఎకరాలు మిగిలింది.
► రంగధాముని (ఐడీఎల్) చెరువు 40 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం ఆక్రమణలతో 30 ఎకరాలకు చేరింది.
► కాముని చెరువు (ఖైత్లాపూర్) 100 ఎకరాలు. ఇందులో సగానికి పైగా మాయమైపోయింది.
► మైసమ్మ చెరువు (మూసాపేట) 100 ఎకరాలు. ఆక్రమణలతో సగమే మిగిలింది.
► సున్నం చెరువు (మోతీనగర్) 25 ఎకరాలు ఉండేది. ఆక్రమణలతో సుమారు 10 ఎకరాలకు చేరింది.
► బోరుున్ చెరువు (బోరుున్‌పల్లి) 100 ఎకరాలు. వెంచర్లతో సగానికి చేరింది.
► ముళ్లకత్వ చెరువు (కేపీహెచ్‌బీ) 30 ఎకరాలు ఉండేది. హైటెక్‌సిటీ బ్రిడ్జి నిర్మాణంతో కొంత కుచించుకుపోరుుంది.
► బందంకుంట (ఆల్విన్‌కాలనీ) 6 ఎకరాలు. ఇదైతే అసలు కన్పించడం లేదు. ఠి పరికిచెరువు (ఆల్విన్‌కాలనీ) 50 ఎకరాలు ఉండేది. అక్రమ వెంచర్లతో సుమారు 30 ఎకరాలు మిగిలింది.
 
 ఎన్నో చెరువులు మాయం
► పర్యాటక కేంద్రంగా పేర్కొనే మాదాపూర్ దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 2002లో కబ్జాకు గురైంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎఫ్‌టీఎల్ పరిధిలో లేఅవుట్లకు అనుమతులివ్వడంతో కబ్జా పర్వానికి తెర లేచింది. అప్పటి హుడా యథేచ్ఛగా ఇంటి అనుమతులు ఇచ్చింది. నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలు అప్పడు వెలసినవే. దుర్గంచెరువు గరిష్ట నీటి మట్టానికి చేరితే అమర్ సొసైటీలో పడవలతో తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దాంతో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి దుర్గం చెరువు పూర్తిగా నిండి ఉండకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల కింద ఇరిగేషన్ అధికారులు ఈ చెరువు పూర్తిస్థారుు మట్టానికి చేరక ముందే నీటిని విడుదల చేశారు. ఇక గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు కబ్జాకోరల్లో చిక్కి ఉనికి కోల్పోరుుంది. గోపన్‌పల్లి చెరువు, నల్లగండ్ల చెరువుల్లో ఆక్రమణలు పెరిగాయి. మియాపూర్‌లోని కారుుదమ్మ కుంట, ఈర్లచెరువు, ప్రకాశ్‌నగర్ చెరువు, పటేల్ చెరువు, గురునాథం చెరువు, అమ్మమ్మ కుంట, మక్త చెరువు, గంగారం చెరువులు కబ్జాల పాలయ్యాయి.
► ఓల్డ్ బోరుున్‌పల్లి డివిజన్‌కు మణిహారంగా ఉన్న హస్మత్‌పేట చెరువు.. 67 ఎకరాల నుంచి 47 ఎకరాలకు కుచించుకుపోరుుంది. ఓ స్కూల్ నిర్వాహకులు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఓ ఎకరం స్థలాన్ని ఆట స్థలంగా చేసుకోవడం గమనార్హం.
► తార్నాకలోని ఎర్రకుంట చెరువు కనుమరుగయ్యే దశకు చేరుకుంది. నిజాం హయాంలో తాగునీటి వనరుగా ఉన్న ఈ 25 ఎకరాల చెరువు ఇప్పు డు ఐదెకరాలే మిగిలింది. మిగిలిన ప్రాంతంలో మినీ ట్యాంక్‌బండ్ నిర్మించాలని నిర్ణయించినా అమలు కావడం లేదు. ఆక్రమణదారులు కోర్టు స్టేలు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.
► మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడలోని ఎర్రకుంట చెరువు పరిధిలో రోజు రోజు కూ కబ్జాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
 
 లోకాయుక్త ఆదేశించినా..

 చెరువుల్లో నిర్మాణాలపై గతంలో కొన్ని సంస్థలు లోకాయుక్తకు ఫిర్యాదులు చేశాయి. వాటిపై స్పందించిన లోకాయుక్త హైదరాబాద్‌లోని అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌లను గుర్తించి, రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాం తో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తూతూ మంత్రం గా చర్యలు చేపట్టి, వదిలేశాయి. లోకాయుక్త ఆదేశించి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌లనే నిర్ధారించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు