చెల్లి పెళ్లి కోసం.. యజమాని ఇంటికి కన్నం

24 Feb, 2015 00:20 IST|Sakshi

డ్రైవర్ రిమాండ్
నగదు, ఆభరణాలు స్వాధీనం

 
బంజారాహిల్స్ :  చెల్లెలి పెళ్లి చేయడానికి దొంగగా మారాడు  ఓ అన్న. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సోమవారం బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీఐలు సామల వెంకట్‌రెడ్డి, ముత్తు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ కు చెందిన అన్నాడి రాంధర్మేందర్ రెడ్డి(28) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లోని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీలో నివసించే బీవీ.మెహర్‌కుమార్ ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన చెల్లెలికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసం ధర్మేందర్ తన యజమాని ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. గత ఏడాది మేలో మెహర్‌కుమార్ లేని సమయంలో ఇంట్లో నుంచి రూ. 2.60 లక్షల నగదు, బంగారు, వజ్రాభరణాలను చోరీ చేశాడు. అదే రోజు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణ జరిపి  సోమవారం ధర్మేందర్ చోరీకి పాల్పడ్డట్లు తేల్చారు. నిందితుడి నుంచి రూ. 2.60 ల క్షల నగదు, రూ. 5.40 లక్షల విలువైన ఆభరణాలు, వివిధ ఉపకరణాలు, విలువైన మాంట్‌బ్లాక్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని  రిమాండ్‌కు తరలించారు.
 
మరో ఘటనలో..

పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుకుంట మండలం ఉండి గ్రామానికి చెందిన సుంకరి సురేష్(27) వెంకటగిరిలో నివసిస్తూ, సత్యవతి అనే మహిళ ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మారు తాళాలతో తలుపులు తెరచి నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టుచేసి రూ. 4.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక బైక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ ముత్తు, ఎస్‌ఐ రమేష్‌లను ఏసీపీ అభినందించారు.
 
 

>
మరిన్ని వార్తలు