డ్రగ్స్‌ కేసులో మరో సంచలనం

15 Jul, 2017 18:03 IST|Sakshi
కెల్విన్‌ ఫోన్‌లో సీక్రెట్‌ ఫోల్డర్‌ డీ కోడింగ్‌

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో మరో ఎనిమిదిమంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం. నిందితులు పేర్కొన్న ఈ జాబితాలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా డ్రగ్స్‌ మాఫియాలో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ను విచారించేందుకు తమకు అప్పగించాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఎక్సైజ్‌ అధికారులు చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఉన్న అతడిని తమ కస్టడీకి తీసుకున్నారు. బాలనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్‌ బృందం అతడిని విచారించింది. కెల్విన్తో పాటు, ఖుద్దుస్‌, వాహిద్‌లను సిట్‌ అధికారులు విచారణ జరిపారు.

మరోవైపు కెల్విన్‌ ఫోన్‌లో సీక్రెట్‌ ఫోల్డర్‌ను అధికారులు డీకోడ్‌ చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో అధికారులు రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం మరో ముగ్గురు నిందితులు అమన్‌ నాయుడు, నిఖిల్‌శెట్టి, కుందన్‌ సింగ్‌ను సిట్‌ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ఇప్పటివరకూ అరెస్ట్‌  డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయినవారి సంఖ్య 14కి చేరింది.  

ఇక కెల్విన్‌కు  సినీ నటులు, డైరెక్టర్‌కు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని వెలుగులోకి రావడంతో పాటు, కొన్ని ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడనే ఆరోపణలున్నాయి. కెల్విన్‌, ఖుద్దుస్‌, వాహిద్‌లను సిట్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. కెల్విన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.