మాజీ ఏఎస్పీ రవీందర్‌రెడ్డిని విచారించిన సిట్

8 Nov, 2016 03:15 IST|Sakshi
మాజీ ఏఎస్పీ రవీందర్‌రెడ్డిని విచారించిన సిట్

నయీమ్ కేసు దర్యాప్తులో వేగం

 హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. మొన్నటికిమొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్యను విచారించిన సిట్ అధికారులు.. సోమవారం మాజీ అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డిని విచారించారు. రవీందర్‌రెడ్డిని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి... సిట్ ఏసీపీ సారుుకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఆయనతో పాటు నయీమ్ డ్రైవర్ శ్యామెల్‌ను కూడా విచారించారు. మూడున్నరేళ్ల పాటు భువనగిరిలో పనిచేసిన రవీందర్‌రెడ్డి... ఆ సమయంలో నయీమ్‌తో ఏర్పడిన పరిచయంతో పలు సెటిల్‌మెంట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. నయీమ్‌తో ఎప్పుడు ఎవరు ప్రయాణించింది... ఎక్కడెక్కడ కలిసేది వంటి వివరాలను శ్యామెల్ నుంచి రాబట్టినట్టు తెలిసింది.

 నయీమ్‌ను కలవలేదు: రవీందర్‌రెడ్డి
 సిట్ విచారణ అనంతరం రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నయీమ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను భువనగిరిలో పనిచేసిన మూడున్నరేళ్లలో నయీమ్ జైలులో ఉన్నాడని, ఎలాంటి కేసులూ డీల్ చేయలేదన్నారు. భువనగిరి తర్వాత చిత్తూరు, మెదక్‌లలో పనిచేసి పదవీ విరమణ పొందానని, ప్రస్తుతం నిజామాబాద్‌లో వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. అరుుతే రిటైరరుున తరువాత తాను ఓసారి నయీమ్‌ను కలిశానన్న రవీందర్... అందుకు కారణం చెప్పలేదు.

 క్యూ కట్టిన బాధితులు: నయీమ్ బెదిరింపులకు భయపడి భూ డాక్యుమెంట్లు కోల్పోరుున బాధితులు నార్సింగ్ ఠాణా ఎదుట క్యూ కట్టారు. భువనగిరిలో లక్ష్మినరసింహస్వామి వెంచర్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు నాలుగు వేల మందిని నయీమ్ అనుచరులు బెదిరించి ఆ భూములను అక్రమించి, డాక్యుమెంట్లు లాక్కున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత నార్సింగ్ ఠాణా పరిధిలో అతడు నివాసముంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఆ భూముల డాక్యుమెంట్లు లభించారుు.

మరిన్ని వార్తలు