ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌

25 Mar, 2017 04:10 IST|Sakshi
ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌

టెన్త్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధానికి చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. మొదట 358 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన సిట్టింగ్‌ స్క్వాడ్‌లను తాజాగా అన్ని  కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది.   ఆయా మండలాల్లోని పోలీసు, రెవెన్యూ, వైద్యా రోగ్య తదితర శాఖల అధికారులు, సిబ్బందితో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. దీంతో శుక్రవారం జరిగిన గణితం పరీక్ష ప్రశ్నపత్రం బయటకు రాకుండా అడ్డుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

144 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు...
ఇన్విజిలేటర్లు, ప్రైవేటు యాజమాన్యాలు కుమ్మక్కై సెల్‌ఫోన్లను రహస్యంగా తీసుకెళ్తూ ప్రశ్నపత్రాలను బయటకు పంపిస్తుండటాన్ని విద్యా శాఖ సీరియస్‌గా తీసుకుంది. జిల్లాల డీఈవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తాజా ఆదేశాలు జారీ చేసింది. 2,556 పరీక్ష కేంద్రాల్లో 842 కేంద్రాలు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయి. పేపరు లీకులు ప్రైవేటు పాఠశాలల్లోని కేంద్రాల్లోనే ఎక్కువగా జరుగుతుండటంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. 144 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా చర్యలు చేపట్టింది. దీనికితోడు 2,198 పరీక్ష కేంద్రాల్లోనూ సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది.

బిట్‌ పేపరు అవసరమా..!
మరోవైపు విద్యార్థికి ప్రశ్నపత్రం ఇవ్వగానే మొదటిపేజీపై మాత్రమే కాకుండా... అన్ని పేజీలపైనా హాల్‌టికెట్‌ నంబరు వేసేలా చర్యలు చేపట్టింది. తద్వారా వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడి యా ద్వారా బయటకు వచ్చే ప్రశ్నాపత్రం ఎవరిదని గుర్తించడం, ఏ పాఠశాలకు చెందిన వారు పేపరు లీక్‌కు పాల్పడ్డారనేది తెలుసుకునే వీలుంటుంది. మరోవైపు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్న  బిట్‌ పేపరు  అవసరమా అని విద్యాశాఖ ఆలోచిస్తోంది.  ఇంటర్‌ తరహాలో  షార్ట్, వెరీ షార్ట్‌ క్వశ్చన్స్‌ ఇస్తే ఎలా ఉంటుందనేది పరిశీలిస్తోంది. 

మరిన్ని వార్తలు