మహా నగరి... ఐటీఐఆర్‌పై గురి!

15 Mar, 2015 04:16 IST|Sakshi
మహా నగరి... ఐటీఐఆర్‌పై గురి!

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా ఆవిష్కరించే ప్రక్రియ జోరందుకుంది. నగర శివారులో సుమారు 202 చ.కి.మీ. పరిధిలో ‘ఐటీఐఆర్ మాస్టర్ ప్లాన్’ను రూపొందించేందుకు 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఫీడ్ బ్యాక్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఆర్వీ అసోసియేట్స్, లీ అసోసియేట్స్, ఎ.ఇ. కాన్ లిమిటెడ్, బీడీఎస్, యాట్‌కిన్స్ సంస్థలు ఉన్నాయి.

‘ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్’ రూపకల్పనకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు ఇటీవల హెచ్‌ఎండీఏ టెండర్లు పిలవగా.. 6 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు. ఇందులో అర్హత సాధించిన సంస్థల సమక్షంలోనే ఫైనాన్షియల్ బిడ్స్ తెరవాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఎవరు తక్కువ మొత్తానికి (ఎల్-1) కోట్ చేస్తే... ఆ సంస్థకు అవకాశం ఉంటుంది. అర్హత గల ఎల్-1, ఎల్-2 సంస్థల జాబితాను హెచ్‌ఎండీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి...ఆయన అనుమతించాక సచివాలయంలోని ృన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఐటీసీ) విభాగానికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. అటునుంచి అనుమతి వచ్చాకఎల్-1 సంస్థను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాక 6 నెలల  వ్యవధిలో ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను హెచ్‌ఎండీఏకు అందజేయాల్సి ఉంటుందని అంటున్నారు.
 
సమగ్ర అధ్యయనం...
మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపికైన సంస్థ హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమమైన ఐటీ సంస్థలు ఏవి? వాటిని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఏమేరకు అవకాశం ఉంది?  ఏయే సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చనే ది కన్సల్టెన్సీ సంస్థ సూచించవచ్చు. కొత్తగా ఏయే సంస్థలు వచ్చే అవకాశం ఉంది? వాటికి ఇక్కడ ఎంత భూమి అందుబాటులో ఉంది? ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించేందుకు గల అవకాశాలు? వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నగరం చుట్టూ 202 చ.కి.మీ. పరిధిలో ప్రస్తుతం ఏయే మాస్టర్ ప్లాన్‌లు అమలులో ఉన్నాయి? ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అనే విషయమై ఆసంస్థ  క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాల్సి ఉంది.  
 
ఐటీ విప్లవం
ఐటీఐఆర్ తొలి దశ (2018)లో రూ.800 కోట్లు రాబట్టుకోవడం ద్వారా హైదరాబాద్‌లో ఐటీ విప్లవాన్ని తేవాలని సీఎం కేసీఆర్ ‘విశ్వ’ ప్రయత్నం చేస్తున్నారు.  గ్రేటర్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న హుడా, హడా, సీడీఏ, తదితర మాస్టర్‌ప్లాన్లకు అవసరమైన మార్పులు చేసి, ఐటీఐఆర్‌కు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని హెచ్‌ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తరువాత దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు తీసుకొని వాటిని కమిటీ ముందు పెట్టి... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి అంతిమంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా అంటే  2016 నాటికి దీన్ని అమలులోకితేవాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు.

మరిన్ని వార్తలు