ఆరేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

23 Jan, 2017 03:45 IST|Sakshi
ఆరేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

రాష్ట్రంలో వ్యవసాయ కార్యాచరణకు నాబార్డు రూపకల్పన

  • సాగులో టెక్నాలజీని విరివిగా ఉపయోగించాలి
  • వృథాగా పోయే ఉత్పత్తులనూ ఆదాయంగా మార్చుకోవాలి
  • సూక్ష్మ సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలి
  • దళారుల ప్రమేయం లేకుండా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి

సాక్షి, హైదరాబాద్‌: ఏటేటా నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నకు చేయూతని వ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రైతు ఆదాయాన్ని ఆరేళ్లలో (2022 నాటికి) రెట్టింపు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనుసరించాల్సిన కార్యాచరణకు జాతీయ వ్యవసాయ, గ్రామీ ణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తాజాగా రూపకల్పన చేసింది. ఉత్తర తెలంగాణలో 46 శాతం, మధ్య తెలంగాణలో 32 శాతం, దక్షిణ తెలంగాణలో 16 శాతం మంది రైతులు పేదరికంలో ఉన్నారని నాబార్డు తెలిపింది. దేశంలో 33 శాతం మంది రైతులు పేదరికం అంచున ఉండగా... తెలంగాణలో 32 శాతం మంది ఉన్నారని పేర్కొంది.

రాష్ట్రంలో 2014ృ15లో ఆహారధాన్యాల ఉత్పత్తి 72 లక్షల టన్నులుండగా.. 2015ృ16లో అది 49.35 లక్షల టన్నులకు పడిపోయిందని వివరించింది. అలాగే 2001ృ02లో ఆహార పంటల సాగు 71 శాతం ఉంటే.. 2014ృ15లో 58 శాతానికి పడిపోయిందని తెలిపింది. రాష్ట్ర రైతుల్లో 86 శాతం మంది సన్న, చిన్నకారు రైతులేనని, వారి చేతిలో 55 శాతం భూమి మాత్రమే ఉందని వివరించింది. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వ్యవసాయ రంగం వృద్ధి తిరోగమనంలో ఉందని స్పష్టం చేసింది.

రెట్టింపు ఆదాయానికి సూచనలివే
► సాగు ఖర్చు తగ్గించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి
► వ్యవసాయ వృథాను కూడా ఆదాయంగా మార్చుకునే పద్ధతులు పాటించాలి. వివిధ పంటలకు అదనపు ఉత్పత్తులు సాధించాలి
► శాస్త్రీయమైన సాగు పద్ధతుల ద్వారా ఉత్పాదకతను పెంచాలి. చీడపీడల నుంచి పంటను రక్షించి పంట నష్టాలను తగ్గించాలి
►తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలి. అందుకు సూక్ష్మసేద్యాన్ని మరింత ముందుకు తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్ర సూక్ష్మసేద్యం ప్రాజెక్టు (టీఎస్‌ఎంఐపీ)ను వేగంగా అమలు చేయాలి
► భూసారాన్ని పెంచాలి. రైతులకు భూసార కార్డులు ఇవ్వాలి. ఏ నేలలో ఎలాంటి పంట వేయాలో రైతులకు చెప్పాలి
► డెయిరీపై దృష్టి సారించాలి. గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించాలి
► రుణ సౌకర్యం కల్పించాలి. పంటల బీమా పథకాలపై అవగాహన కల్పించాలి
► పంట కోత అనంతరం జరిగే నష్టాలను అరికట్టాలి. గిట్టుబాటు ధర వచ్చే వరకు అవసరమైన పంట నిల్వ సౌకర్యం కల్పించాలి
► దళారుల ప్రమేయం లేకుండా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి
► రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)లను విరివిగా ఏర్పాటు చేయాలి
► ప్రాంతాలవారీగా పథకాలకు రూపకల్పన చేయాలి. డెయిరీ, కోళ్ల పరిశ్రమ, సోలార్‌ ఎనర్జీ, కూరగాయల సాగు వంటి వాటిని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలి

జిల్లాల వారీగా నాబార్డు ప్రణాళిక...
► కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయాలి. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయాలి. ఈ జిల్లాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. పప్పు, ఆయిల్‌ మిల్లులను ఏర్పాటు చేయాలి
► ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భూసారంపై దృష్టి సారించాలి. పంట నిల్వ, ప్రాసెసింగ్, అదనపు ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించాలి. పంటను నేరుగా మార్కెట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలి
► మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉద్యాన, పశుసంవర్ధక శాఖల పరిధిలోని పథకాల అమలుతో ఆరేళ్లలో రైతులు రెట్టింపు ఆదాయాన్ని పొందొచ్చు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలి. ఈ జిల్లాలు పప్పుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమైనవి.
► మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సూక్ష్మసేద్యం వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు సాగు చేయాలి. డెయిరీ, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచాలి. ఆర్గానిక్‌ మిషన్‌ (భూసంజీవిని)ను ప్రోత్సహించాలి
► నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునే పథకాలను అభివృద్ధి చేయాలి. పత్తి, కూరగాయలు, ఉద్యాన పంటలకు సూక్ష్మసేద్యం వసతి కల్పించాలి
► నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే కాబట్టి అక్కడ ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలి. నీటి వనరులను అభివృద్ధిపరచాలి
► ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, అసిఫాబాద్‌ జిల్లాల్లో పత్తి ఎక్కువగా సాగు అవుతుంది. ఈ ప్రాంతాల్లో మొక్కజొన్న, కంది, కూరగాయలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి. గ్రామాల వారీగా విత్తన బ్యాంకులను నెలకొల్పాలి.

మరిన్ని వార్తలు