యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

10 Apr, 2016 00:42 IST|Sakshi
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

సాక్షి, హైదరాబాద్: యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందడుగు వేస్తున్నాయి.  దేశంలో చాలా పరిశ్రమలు నైపుణ్యం కలిగిన కార్మికులు లభించక సతమతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికోసం శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో  శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర కార్మికశాఖ నిర్ణయించింది.

అందుకు అనుగుణంగా కార్మికశాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన విభాగం కసరత్తు చేస్తోంది. సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో మూడు సెంటర్లకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌లోని మల్లేపల్లి శిక్షణ కేంద్రంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్‌లో ఏర్పాటు చేసిన సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి నిర్వహణ ఖర్చుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేసింది. త్వరలో మరో మూడు సెంటర్లకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. వాటిని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌లలో ఏర్పాటు చేయాలని ఉపాధి కల్పనశాఖ యోచిస్తోంది.

 నిరంతరాయంగా శిక్షణ తరగతులు..
 ఈ సెంటర్లలో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణతోపాటు ఎలాంటి చదువులతో మెరుగైన ఉపాధి లభిస్తుందో వివరిస్తారు. ఈ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. కాగా, జిల్లాల్లో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందినే ఈ సెంటర్లలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు