విశ్వనగరమే నినాదంగా

2 Feb, 2016 00:43 IST|Sakshi
విశ్వనగరమే నినాదంగా

♦ గ్రేటర్ ఎన్నికల్లో ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్
♦ తొలిసారి 150 డివిజన్లలో పోటీ
♦ అభివృద్ధి కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం
♦ గతంలో పాలించిన పార్టీలు చేసిందేమీ లేదంటూ విమర్శనాస్త్రాలు
♦ బల్దియాపై తమ జెండా ఎగురుతుందని ధీమా
 
 సాక్షి, హైదరాబాద్: విశ్వనగరమే నినాదంగా తొలిసారి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగిన అధికార టీఆర్‌ఎస్.. మేయర్ పీఠంపై జెండా ఎగ రేసేందుకు ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆరేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క డివిజన్‌లోనూ పోటీ చేయని గులాబీ పార్టీ ఈసారి మొత్తం 150 డివిజన్లలో తలపడుతోంది. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుని ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో పార్టీ శ్రేణులను మోహరించింది. గులాబీ నేతలు, కార్యకర్తలంతా మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 విసృ్తతంగా ప్రచారం..
 రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్.. రాజధాని నగరంలోనూ తమ పాలనే ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఒకటికి రెండుసార్లు మందలించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో ప్రచారం చేశారు. జంట నగరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలకు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి హోంవర్క్‌గా ప్లాన్ చేసింది. అభ్యర్థుల ఖరారు తర్వాత రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని రంగంలోకి దించి, ఏ ఒక్క బూత్‌ను వదలకుండా ప్రచారం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లు, నగరానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న అంశంపై ఎక్కువగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.
 
 విపక్షాలపై వినూత్న దాడి
 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్.. విమర్శనాస్త్రాలతో ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోనీయకుండా చేసింది. ఆరు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పాలన చేసింది కాంగ్రెస్, టీడీపీలే అని, వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎండగట్టింది. టీడీపీతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ పడుతున్న బీజేపీపై మరో రకంగా విరుచుకుపడింది. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపిం చింది. నగరంలో నివసిస్తున్న వారంతా ఇక్కడి వారేనన్న ధీమా కల్పించేలా ప్రచారం చే సింది. ఎన్నికల ప్రచార బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. 9 రోజుల పాటు 120 డివిజన్లలో ప్రచారం చేసిన ఆయన.. 135 చోట్ల ప్రసంగించారు. కుల సంఘాలు, న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. తమతోనే నగరాభివృద్ధి సాధ్యమంటూ ముమ్మరంగా ప్రచారం చేసిన అధికార పార్టీ.. బల్దియాపై తమ జెండా ఎగరడం ఖాయమన్న నమ్మకంతో ఉంది.

మరిన్ని వార్తలు