హుస్సేన్ సా‘డర్’!

29 Aug, 2015 00:58 IST|Sakshi
హుస్సేన్ సా‘డర్’!

సిటీబ్యూరో హుస్సేన్‌సాగర్ అందాలను వీక్షిస్తూ... ట్యాంక్‌బండ్‌పై కాసేపు అలా సరదాగా గడపాలనుకుంటున్నారా... బోటు షికారు సైతం చేయాలనుకుంటున్నారా...అయితే మీరు తప్పకుండా ఓ ఖర్చీఫ్ లేదా నాప్కిన్ టవల్ లేదా స్కార్ఫ్‌ను వెంట తీసుకెళ్లండి. లేదంటే ముక్కుపుటాలదిరే దుర్గంధానికి మీరు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనుదిరుగుతారు. సాగర్ శుద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేయడంతో చారిత్రక హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారింది. ప్రక్షాళన పేరిట కొంతమేర నీటిని బయటికి వదిలివేయడంతో ఇప్పుడు వ్యర్థాలు బయటకు తేలి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డు వైపు సాగర్ నీటిపై అక్కడక్కడా ‘ఆల్గే’ ఛాయలు  కన్పిస్తున్నాయి. ఇది సాగర్ అంతటికీ విస్తరిస్తే ఇక ముక్కు మూసుకోకుండా అక్కడ సంచరించడం అసాధ్యమే.  బోట్ షికారుకు వెళ్లి వచ్చిన పర్యాటకులు సాగర్ లోపల భరించరాని దుర్వాసన ఉందంటూ పెదవి విరుస్తున్నారు. 

బోట్ దిగగానే కొందరు వాంతులు చేసుకొన్న సంఘటనలూ ఉన్నాయి. నెక్లెస్ రోడ్‌లో పరిస్థితి మరీ దారుణం. పలు ప్రాంతాల నుంచి వచ్చే నాలాలు సాగర్‌లో కలిసే చోట పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల  దుర్వాసన గుప్పుమంటోంది. దీంతో నెక్లెస్ రోడ్‌కు వెళ్లాలంటేనే నగర వాసులు హడలిపోతున్నారు. కూకట్‌పల్లి నాలా నుంచి సాగర్‌లో చేరుతున్న రసాయన వ్యర్ధాలను అడ్డుకోకపోవడం వల్లే  ఈ పరిస్థితి అని తెలుస్తోంది. ఏదిఏమైనా క్రమక్రమంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావర ణం దూరమవుతోంది. దీనిపై అధికారులను వివరణ కోరితే సాగర్ తీరంలో అసలు దుర్వాసనే లేదంటూ కొట్టిపారేయడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు