'భౌ ' బోయ్!

5 May, 2015 00:00 IST|Sakshi
'భౌ ' బోయ్!

సమ్మర్ ఎఫెక్ట్...   
గ్రేటర్‌లో విజృంభిస్తున్న గ్రామ సింహాలు  
రోజుకు సగటున 35 కుక్కకాటు కేసులు     
ఆందోళనలో గ్రేటర్ బస్తీ వాసులు

 
మండే ఎండలు మనుషుల్నే కాదు..వీధి కుక్కల్నీ చిర్రెత్తిస్తున్నాయి. ఎండ వేడిమితోపాటు సరైన ఆహారం, నీరు దొరక్క.. కుక్కలు పిచ్చికుక్కలుగా మారుతున్నాయి. వీధుల్లో కనబడినవారినల్లా కరిచేస్తున్నాయి. గ్రేటర్ పరిధిల్లో ఒక్క మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే అత్యధికంగా 1970 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రికి రోజుకు 35 వరకు కుక్కకాటు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. వేసవి తీవ్రత వల్లే కుక్కకాటు కేసులు  పెరుగుతున్నాయని వైద్యనిపుణులు సైతం పేర్కొంటున్నారు.
 
సిటీబ్యూరో:  మండే ఎండలు...కాలుతున్న కడుపు..ఈ రెండూ వీధి కుక్కల్ని పిచ్చి కుక్కలుగా మార్చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో.. ఇంటి చుట్టూ తిరిగే శునకాలే ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. వేసవి తీవ్రతకు తోడు కడుపు నిండా తిండి, నీరు దొరక్కపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తూ వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులను కరిచేస్తున్నాయి. ఈ ఏడాది ఎండలు పెరిగిన తర్వాత మార్చి 1 నుంచి మే 3 వ తేదీవరకు రెండు నెలల కాలంలో 1970 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు జనవరి, ఫిబ్రవరి మాసాలతో పోల్చుకుంటే వేసవి మాసాల్లోనే కుక్కకాటు కేసులు పెరిగాయి. ‘సాధారణంగా ఎండాకాలంలో కుక్కలకు ఆహారం, నీరు సరిగా లభించదు. దీనికి తోడు ఎండల్లో తిరగడం వల్ల కుక్కలలో ఇరిటేషన్ పెరుగుతుంది. దాంతో అవి దాడుల తీవ్రతను పెంచుతాయి. వీధుల్లో పిచ్చిపట్టినట్లుగా తిరుగుతూ కనబడినవారిపై దాడులు చేసి కరుస్తాయి.’ అని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. మిగతా మాసాల కంటే వేసవిలోనే కుక్కకాటు కేసులు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ రెండు మూడు నెలల కాలంలో కుక్కల బారిన పడకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
 
రోజుకు 35 కేసులు

ఇటీవల ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే రోజుకు సగటున 30-35 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. 2013లో అత్యధికంగా 11621 కేసులు నమోదు కాగా, వీరిలో 23 మంది రేబిస్ బారిన పడ్డారు. 2014లో తొమ్మిది వేలమంది కుక్కుకాటు బారిన పడగా, వీరిలో పదిహేను మంది రేబిస్ బారిన పడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3520 కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి.
 
రేబిస్..యమ డేంజర్

కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. అయితే ప్రతి కుక్క కాటుకు రేబిస్ వ్యాధి వస్తుందని కాదు కానీ, ముందు జాగ్రత్తగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడమే ఉత్తమం. కుక్కకాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. రేబిస్ సోకిన వారిలో జ్వరం, తల నొప్పి, వాంతులు, వంటి లక్షణాలు మొదటి దశలో కనిపిస్తాయి. పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించ లేక పోవడం, నోరులోంచి నురుగు రావడం, మంచి నీరు తాగేప్పుడు గొంతు పట్టేయడం, గాలి వీచినప్పుడు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు రెండో దశలో కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయి, రెండు మూడు రోజుల్లో చనిపోతారు.
 
రిగ్ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉంచాలి  

 రేబిస్ ఇమ్యునో గ్లాబులిన్(రిగ్) ఇంజక్షన్‌లు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచాలి. వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా...అధికారులు ఇండెంట్ పెట్టడంలేదని తెలుస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా ఒక ఫీవర్ ఆస్పత్రిలోనే రిగ్ ఇంజక్షన్ అందుబాటులో ఉంది.  దూర ప్రాంతాలకు చెందిన బాధితులు విధిలేని పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వస్తోంది.
 - ఎన్.యాదగిరి, చంపాపేట్
 
శివారు జిల్లాల నుంచి వలసల వల్లే...

ఎంసీహెచ్ పరిధిలో దాదాపు లక్షన్నర కుక్కలుండగా, జీహెచ్‌ఎంసీగా మారి విస్తీర్ణం పెరగడం.. శివారు ప్రాంతాల్లోకి పొరుగు జి ల్లాల నుంచి కుక్కలు వలస రావడంతో ప్రస్తుతం వీటి సంఖ్య మూడు లక్షలు దాటినట్లు ఓ అంచనా. పొరుగు ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కుక్కల సంఖ్య తగ్గకపోవడం.. బస్తీల్లో పట్టిన కుక్కలను శివారు ప్రాంతాల్లో వదులుతుండటం, మళ్లీ అవి బస్తీలకు వలస వస్తుండటం వల్ల సమస్య పెరుగుతోంది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల మేరకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు(స్టెరిలైజేషన్) ద్వారా మాత్రమే ప్రజలకు కుక్కల నుంచి హాని లేకుండా చేయాల్సి ఉంది. ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్‌చెరులో సంతాన నిరోధక శస్త్రచికిత్సల కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏటా దాదాపు 80 వేల కుక్కలకు టీకాలు, నెలకు రెండువేల కుక్కలకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.
 
 విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి

వీధి కుక్కలను సాధ్యమైనంత వరకు నియంత్రించాలి
వేసవి కాలంలో పిల్లలను వీధుల్లో ఆడకుండా..కుక్కల బారినపడకుండా మనమే జాగ్రత్తపడాలి
ఒక వేళ కుక్క కరిస్తే...వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి
రక్తం కారుతున్నా...గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పోయకూడదు
ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
 కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
ఇంట్లో ఉన్న కుక్కలకు ప్రతి మూడు మాసాలకు ఒకసారి తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించాలి
 -డాక్టర్ శంకర్, సూపరింటిండెంట్,
 ఫీవర్ ఆస్పత్రి
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా