గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే

28 Jan, 2016 04:09 IST|Sakshi
గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే

- ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి


సాక్షి, హైదరాబాద్‌:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. విభజన జరిగిన 19 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో వృద్ధి సాధించిందని, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తొలి అర్థ సంవత్సరంలోనే 27.17 శాతం వృద్ధి నమోదైందని, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రకెక్కుతుందని.. ఇలా పచ్చి అబద్ధాలతో అధికార టీడీపీ రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ యథాతథంగా చదవటం హాస్యాస్పదమన్నారు.

బుధవారం ఇందిరాభవన్ లో విలేకరులతో మాట్లాడిన తులసిరెడ్డి.. రాష్ట్రం రెవెన్యూ లోటు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, పన్ను రాయితీ, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ఓడరేవు, కొత్త రైల్వే జోన్ లాంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతుండగా, వాటికి పరిష్కారాలు కనిపెట్టాల్సిందిపోయి లేనిది ఉన్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారి కాబోతున్నప్పటికీ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉలుకు పలుకూ లేకుండా పడిఉన్నారని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు