‘శోభా’యమానం

29 Mar, 2015 03:12 IST|Sakshi

అబిడ్స్/జియాగూడ/కలెక్టరేట్/
సుల్తాన్‌బజార్: జైశ్రీరామ్...జై వీర హనుమాన్ అంటూ లక్షలాది మంది భక్తుల నినాదాల నడుమ శ్రీరామ నవమి శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. ధూల్‌పేట్ నుంచి పురానాపూల్, జిమ్మెరాత్ బజార్, చుడీ బజార్, ఛత్రి, బేగంబజార్, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్ వరకు నగర రహదారులు కాషాయమయంగా మారాయి. వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధూల్‌పేట్ గంగాబౌలిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగింది.

మొదటిసారిగా సీతారాంబాగ్ ఆలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి నాయకులు ఈ యాత్రను నిర్వహించారు. బృందావన్ నుంచి వచ్చిన సాధ్వీ సంహిత, ఆధ్యాత్మిక గురువు స్వామి కమలానంద భారతి సీతారాం బాగ్‌లో ఉదయం 11 గంటలకు పూజలు చేసి... యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు గంగాబౌలిలో ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ, ఆలిండియా బీజేపీ కార్యదర్శి మురళీధర్‌రావులు శ్రీరాముడికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. రాత్రి వరకూ ఈ వేడుక కొనసాగింది.
 
ఉర్రూతలూగించిన డోల్ పతక్ బ్యాండ్...
పూణె నుంచి వచ్చిన కళాకారుల డోల్ పతక్ బ్యాండ్ ఉర్రూతలూగించింది. 101 మంది యువతీ యువకులు నృత్యాలు చేస్తూ... శివాజీ, శ్రీరాముడి భక్తి గీతాలు పాడుతూ బ్యాండ్‌లో పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న విగ్రహాలు
ఈ యాత్రలో భారీ శ్రీరాముడి విగ్రహం, శివాజీ, హనుమంతుడు, సీతారామ లక్ష్మణలు, రాణిఅవంతిబాయి, శేషశయ్యపై ఆదివిష్ణువు, రామసేతు, శ్రీరాముడి పట్టాభిషేకం విగ్రహాలు భక్తుల మదిని దోచుకున్నాయి. ధూల్‌పేట్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ఆనంద్‌సింగ్ నిర్వహించిన ఫాల్కీ యాత్రలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
రామ మందిరం నిర్మిద్దాం:సాధ్వీ సంహిత

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ప్రతి భక్తుడూ కోరుతున్నారని బృందావన్   వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వీ సంహిత పేర్కొన్నారు. ఛత్రీ చౌరస్తా వద్ద భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ హిందూ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గోవధ నిషేధ చట్టం పూర్తిగా అమలయ్యే విధంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
 
హిందువుల ఐక్యతే ప్రధానం: ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ
హిందువులు ఐక్యంగా ఉంటే శత్రువులు పారిపోతారని యాత్ర నిర్వాహకుడు, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పిలుపునిచ్చారు. బేగంబజార్ చౌరస్తాలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు కేశవరాజు, రామరాజు, యమన్‌సింగ్, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.
 
విద్యుత్‌అంతరాయం
బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అభ్యంతరం తెలిపి శోభాయాత్ర నిలిపివేశారు. పోలీసులు సైతం విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో యాత్ర కొనసాగింది.
 
ప్రశాంతంగా ముగింపు
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసింది. దీంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
 
భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో నిర్వహించిన శోభాయాత్రలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి బందోబస్తుకు కేటాయించారు. మరోపక్క ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వాహనాలను దారి మళ్లించారు. ఈసారి ‘వీడియో కెమెరా మౌంటెడ్ వెహికిల్’ను యాత్ర ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో మరొక టి  వినియోగించారు.

వీటి ద్వారా అక్కడి దృశ్యాలను పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్‌లు అంజనీకుమార్, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి, డీసీపీలు రంగనాథ్, చౌహాన్‌లు తిలకించారు. వీరితో పాటు అగ్నిమాపక శాఖ, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం తిలకించారు. బందోబస్తులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్ జోన్‌ల డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సుధీర్‌బాబు, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
అడ్డుకున్న పోలీసులు
యాకుత్‌పురా: ఉప్పుగూడ హనుమాన్ నగర్‌లోని శ్రీ మంగళ్‌ముఖి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన   శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదని.. వెంటనే తీసేయాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీసుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటి తరువాత వివాదం సద్దుమణిగింది. 

మరిన్ని వార్తలు