మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

2 Mar, 2016 19:34 IST|Sakshi
మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

మానసిక ఒత్తిడికి లోనై ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ రమేశ్ కుమార్ వివరాలు తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన సత్యనారాయణ సింగ్, పుష్ప దంపతుల కూతురు రాణి మనీషా గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆరు నెలలుగా పని చేస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆమె గచ్చిబౌలిలోని న్యూ బాలాజీ ఉమెన్స్ హాస్టల్ రూమ్‌లో ఉంటోంది. మంగళవారం రాత్రి ఆమె హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. బుధవారం ఉదయం హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో చనిపోయి ఉండటాన్ని హాస్టల్ నిర్వాహకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు, మానసిక ఒత్తిడే కారణమని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా హాస్టల్‌లో గానీ, కంపెనీలో గానీ ఎవరితోనూ మాట్లాడటం లేదని, ఒంటరిగా ఉంటోందని తెలిసింది.


ఆవుతో ఆప్యాయంగా..
రాణి మనీషాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. యోగా పుస్తకాలు చదువుతుందని, దైవభక్తి ఎక్కువని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఆవుకు పండ్లు తినిపించడం ఆమెకు ఆలవాటు. ఫిబ్రవరి 26న పండ్లు తీసుకొని రాగా ఆవు కనిపించకపోవడంతో కంగారుపడ్డ ఆమె కొద్ది దూరం వెళ్లి ఆవును హాస్టల్ వద్దకు తీసుకొచ్చింది. పండ్లు తినిపించిన అనంతరం కొద్ది నిమిషాల పాటు ఆవును నిమిరింది. హాస్టల్‌లోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలను చూసిన పలువురి కళ్లు చెమర్చాయి.

మరిన్ని వార్తలు