సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్.. విడుదల

14 May, 2015 11:17 IST|Sakshi
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్.. విడుదల

హైదరాబాద్ : పోలీసులమని చెప్పి దుండగులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసి.. తీవ్రంగా కొట్టి ఎల్బీనగర్‌లో వదిలేశారు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం... హైదర్షాకోట్‌లో నివాసం ఉండే సంతోష్‌కుమార్ యూఎస్‌ఏలో ఉంటూ 8 నెలల క్రితం నగరానికి వచ్చాడు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఐబీఎంలో టీం లీడర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30కి సంతోష్‌కుమార్ ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా... మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఇద్దరు దుండగులు... పోలీసులమని చెప్పి అతడి కారును అడ్డగించి,  తాళం చెవి తీసుకున్నారు.
 
సంతోష్‌ను డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దించి, నీతో మాట్లాడాలి వెనుక సీట్లో కూర్చో అని చెప్పారు. అదే సమయంలో వెనుక కారులో వస్తున్న ఐబీఎం ఉద్యోగి ప్రసాద్ వారి వద్దకు వెళ్లి సంతోష్ కారును ఎందుకు ఆపారని ప్రశ్నించగా తాము పోలీసులమని చెప్పారు. దీంతో ప్రసాద్.. సంతోష్ కారును వెంబడించి... గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వరకు వెళ్లాడు.
 
ఆ తర్వాత సంతోష్ ప్రయాణిస్తున్న కారు కనిపించక పోవడంతో ప్రసాద్ ఆందోళన చెంది... అతడి సెల్కి ఫోన్ చేశాడు. సంతోష్‌ ఫోన్  స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో అతను నేరుగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడిని ఎవరో పోలీసులమని చెప్పి  కారులో తీసుకెళ్లారని ఫిర్యారు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబరాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు.

పోలీసులమని చెప్పిన ఇద్దరు వ్యక్తులు సంతోష్‌ను చితకబాది ఎల్బీనగర్‌లో వదిలేశారు. రాత్రి 11.00 గంటల సమయంలో సంతోష్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాము టాస్క్‌పోర్స్ పోలీసులమని చెప్పిన దొంగలు... అదృశ్యమైన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆచూకీ చెప్పాలని వారు సంతోష్‌పై తీవ్ర ఒత్తిడి చేసి దాడి చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు