ప్రజలపై ‘సౌర’ ధరాభారమా?

3 Aug, 2016 01:16 IST|Sakshi
ప్రజలపై ‘సౌర’ ధరాభారమా?

అధిక ధర పీపీఏల గడువు పెంచడంపై ఈఆర్సీ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుదుత్పత్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) పై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) తాజాగా కీలక ఆదేశాలిచ్చిం ది. 2012లో 1,000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం ప్రైవేటు సంస్థలతో కుదిరిన పీపీఏలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో నిర్మాణం పూర్తికానివి ఉంటే వాటి గడువును 2016 మార్చి 31 తర్వాత నుంచి పెంచడానికి వీల్లేదని ఆదేశించింది.

సౌర విద్యుత్  ధరలు రోజురోజుకూ తగ్గుతున్నా గతంలో అధిక ధరకు కుదిరిన పీపీఏలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణ గడువును టీఎస్‌ఎస్పీడీసీఎల్ పెంచడాన్ని ఈఆర్సీ తప్పుబట్టింది. ఇది రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపడమేనని మండిపడింది. 2014లో 500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి తెలంగాణ రాష్ట్రంలో కుదిరిన పీపీఏలకూ ఈ ఆదేశాలను వర్తింపజేసింది. 2012లో యూనిట్‌కు రూ.6.49 పలికిన సౌర విద్యుత్ ధరలు 2015 నాటికి రూ.5.17కు తగ్గడం, యూనిట్‌కు రూ. 4-4.50 ధరకే సౌర విద్యుత్‌ను విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈఆర్సీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

2015 మార్చి 31 తర్వాత పూర్తై ప్రాజెక్టుల విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.17 నుంచి రూ.5.59 మధ్య ఉండాలని తేల్చి చెప్పింది.ఆలస్యమైన ప్రాజెక్టుల గడువు పెంచడమే కాకుండా త్వరగా నిర్మా ణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను ప్రకటించడాన్నీ ఈఆర్సీ తప్పుపట్టింది. త్వరగా పూర్తై ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు చెల్లించొద్దని ఆదేశించింది.

మరిన్ని వార్తలు