నగరానికి పద్మాభిషేకం

26 Jan, 2016 02:56 IST|Sakshi
నగరానికి పద్మాభిషేకం

పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డుల పంట
కొంతమందికి పద్మశ్రీ అవార్డులు

 
సిటీబ్యూరో : భాగ్యనగరంలో      ‘పద్మా’లు వికసించాయి. వివిధ రంగాల్లో మహోన్నత సేవలందించిన ప్రముఖులకు కేంద్రం సోమవారం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులు అందుకున్న వారిలో  తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. సాహిత్యం, పాత్రికేయ రంగంలో అపార సేవలందించినందుకు‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును ‘పద్మవిభూషణ్’తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. సీనియర్ వైద్య నిపుణులు, ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్ ప్రొఫెసర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘పద్మ భూషణ్’ వరిం చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్,టెన్నిస్ తార సానియా మీర్జాలకూ ‘పద్మ విభూషణ్’ అవార్డు లభించింది.

ప్రముఖ చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్, కార్డియో థొరాసిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మన్నం గోపీచంద్, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సునీత కృష్ణన్, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ టీవీ నారాయణలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా లభించిన ఈ అవార్డులతో హైదరాబాద్ మురిసింది. అవార్డులు అందుకున్న ప్రముఖుల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. ఇద్దరు క్రీడాకారులు సానియా, సైనాలకు అవార్డులు లభించడం పట్ల క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగానికి సైతం సముచితమైన గౌరవం లభించడంతో అంతటా సంతోషం వ్యక్తమైంది.
 

మరిన్ని వార్తలు