సమ్థింగ్ స్పెషల్.. ‘మెట్రో’ స్టేషన్

27 Nov, 2015 12:41 IST|Sakshi
సమ్థింగ్ స్పెషల్.. ‘మెట్రో’ స్టేషన్

హైదరాబాద్: నగరంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ మెట్రో స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయి..తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ స్టేషన్‌లో వాణిజ్య ప్రకటనల బోర్డులు, రిటెయిల్ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేశారు.

రహదారి పైనుంచి లిఫ్ట్ లేదా మెట్ల మార్గం నుంచి పైకి చేరుకోగానే స్టేషన్ మధ్యభాగం(కాన్‌కోర్స్) వాణిజ్య మాల్‌ను తలపిస్తోంది. సుమారు పదివేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో పలు రిటెయిల్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. గురువారం ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో పొలిటోస్ చికెన్ స్టోర్‌ను ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎం.డీ వీబీగాడ్గిల్ ప్రారంభించారు.

ఇక ఇక్కడున్న పిల్లర్లు సహా స్టేషన్‌లోనికి ప్రవేశించే బయటికి వెళ్లే మార్గాలు, రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్‌ఫారాలపై వాణిజ్య ప్రకటనల ఏర్పాటుకు వీలుగా అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 64 స్టేషన్లలో కొన్నింట చిన్నారులు, మరికొన్ని చోట్ల మహిళల వస్తువులు దొరికేవి మరి కొన్నింట ఎలక్ట్రానిక్‌ వస్తువులు దొరికేవిగా, మరికొన్ని స్టేషన్లు వినోదం అధికంగా ఉండే స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు.       
 
స్టేషన్లలో వాణిజ్య ప్రకటనల ఏర్పాటుకు...
మెట్రో పిల్లర్లు, పోర్టల్స్, వయాడక్ట్స్, స్టేషన్ లోపల, బయట, ప్లాట్‌ఫారంపై, మెట్రో రైలు లోపల,బయట వివిధ సంస్థలు వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా బోర్డులు ఏర్పాటు చేశారు. వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు లేదా వ్యక్తులు advertising@ltmetro.com వెబ్‌సైట్‌ను చూడవచ్చు. స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని బట్టి వాణిజ్య ప్రకటనలకు చార్జీలు వసూలు చేస్తారు.
 
 
మూడు మార్గాల్లో 64 స్టేషన్లు..

  • ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్1)
  • జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్2)
  • నాగోలు-రాయదుర్గం (కారిడార్3) మార్గంలో మెత్తం 64 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు ఏర్పాటుచేయనున్నారు.
     
  • స్టేషన్లను మూడు భాగాలుగా విభజించారు. ఇందులో 55 స్టేషన్లను టిపికల్ స్టేషన్లు(రద్దీ అధికం), అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్‌గ్రౌండ్స్ ప్రాంతాల్లో రెండు మెట్రో కారిడార్లు కలిసేచోట ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఇక హైటెక్‌సిటీ, పంజాగుట్ట, శిల్పారామం, బేగంపేట్ స్టేష్టన్లను ప్రత్యేక స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు.
     
  •  టిపికల్ స్టేషన్‌లో వాణిజ్య స్థలం 2500 చదరపు అడుగుల నుంచి 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
  •  స్టేషన్ లోనికి ప్రవేశించే,బయటికి వెళ్లే మార్గాల్లో వెయ్యి నుంచి 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటెయిల్ స్పేస్ ఉంటుంది.
     
  •  రిటెయిల్ స్పేస్‌లో కనిష్టంగా 100చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇంటర్‌ఛేంజ్,స్పెషనల్ స్టేషన్ల లో గరిష్టంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటెయిల్ దుకాణాలుంటాయి.

 
స్టేషన్లలో లభించే వస్తువులు..

రిటెయిల్ దుకాణాలు: కన్వీనియన్స్,నిత్యావసరాలు,కూరగాయలు,రోజువారీ అవసరాలు,యాక్ససరీలు
ఫుడ్ అండ్ బ్రూవరీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, లార్జ్ ఫార్మాట్ ఫుడ్‌కోర్ట్స్
సర్వీసులు: ఎటీఎం, మెడికల్ స్టోర్లు, లాండ్రీ సెంటర్లు
 

మెట్రో స్టేషన్లలో దుకాణం ఏర్పాటు చేయాలంటే...
మొత్తం 64 మెట్రో స్టేషన్లలో సుమారు 3.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది. స్టేషన్‌ను బట్టి ప్రతి చదరపు అడుగుకు నెలకు కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.450 వరకు అద్దె వసూలు చేస్తారు. ఇప్పటివరకు మొత్తంగా 25 శాతం వాణిజ్య స్థలం కేటాయింపు పూర్తయ్యింది.

రాయదుర్గం, హైటెక్‌సిటీ, ఎర్రమంజిల్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లలోనూ వాణిజ్యస్థలాలను పూర్తిగా అద్దెకిచ్చారు. వాణిజ్య స్థలం కావాలనుకునేవారు హైటెక్‌సిటీ సైబర్‌టవర్స్‌లోని ఎల్‌అండ్‌టీ మెట్రో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అనుభవం,అర్హతలతోపాటు ముందుగా వచ్చినవారికే ప్రాధాన్యతనిస్తామన్నారు.

మరిన్ని వార్తలు