త్వరలో మూడో విడత ‘మాఫీ’ నిధులు

17 Jun, 2016 02:53 IST|Sakshi
త్వరలో మూడో విడత ‘మాఫీ’ నిధులు

* విడుదల చేస్తామని బ్యాంకర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ హామీ
* రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దని సూచన

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించిన మూడో విడత నిధులను త్వరలోనే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ బ్యాంకర్లకు తెలిపారు. రుణ మాఫీకి సంబంధించిన వడ్డీని రైతుల నుంచి వసూలు చేయరాదని స్పష్టం చేశారు. వడ్డీ, రుణ మాఫీ అంశం ప్రభుత్వానికి, బ్యాంకర్లకు సంబంధించిన అంశమని రైతులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

పంట రుణ మాిఫీలో లబ్ధి పొందిన అనర్హుల వివరాలను బ్యాంకర్లకు పంపించామని, వారి నుండి రికవరీ చేసేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పంట రుణ మాఫీకి సంబంధించి రైతుల భూ వివరాల కోసం రెవెన్యూ శాఖ వెబ్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని బ్యాంకర్లను సూచించారు. గురువారం సచివాలయంలో 6 ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. 2016-17లో రూ.29,101 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఖరీఫ్‌లో రూ.17,460 కోట్ల మేర రుణాలు రైతులకు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత మేరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ స్కేల్ ప్రకారం రైతులకు రుణాలు చెల్లించాలని సూచించారు. రైతులకు పంట రుణాల రెన్యువల్స్‌ను వేగవంతం చేయాలన్నారు.

అర్హులైన రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో బ్యాంకు సిబ్బంది వడ్డీని చెల్లించాలని రైతులను కోరుతున్న విషయాన్ని వివరాలతో సహా బ్యాంకర్లకు తెలిపారు. ఖరీఫ్ 2016 సంవత్సరానికి సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాల ద్వారా వివిధ పంటలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కటాఫ్ డేట్ వివరాలను బ్యాంకర్లకు అందించారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్, ఎస్‌బీఐ జీఎం గిరిధర్ కిని, డీజీఎం వి.సదా శివం, డీజీఎం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏజీఎం జేబీ సుబ్రమణ్యం, టీఎస్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎండీ మురళీధర, ఏపీజీబీ జీఎం టీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు