‘తెలంగాణ సోన’కు త్వరలో గుర్తింపు

9 Mar, 2016 01:24 IST|Sakshi
‘తెలంగాణ సోన’కు త్వరలో గుర్తింపు

♦ మధుమేహాన్ని నియంత్రించే బియ్యంపై రైతుల ఆసక్తి
♦ వచ్చే కేంద్ర విత్తన కమిటీ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోన’ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత అక్టోబర్‌లో విడుదల చేసిన మధుమేహ నియంత్రణ ఆర్‌ఎన్‌ఎస్-15048 రకం వరికి త్వరలో కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించనుంది. ఈ మేరకు తెలంగాణ విత్తన ఏజెన్సీ కేంద్రానికి ప్రతిపాదించింది. విత్తన కమిటీ గుర్తింపు లభిస్తే దేశవ్యాప్త మార్కెట్‌లో దాన్ని వాణిజ్యపరంగా విక్రయించేందుకు అవకాశాలుంటాయి.

వ్యవసాయ వర్సిటీ అధికారికంగా విడుదల చేయకముందే ఈ రకం వరిని ఇప్పటికే రాష్ట్రంలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పంట కాల వ్యవధి 125 రోజులే ఉండటం, సాధారణ వరి కంటే ఎకరాకు 8 క్వింటాళ్లు అధిక దిగుబడి ఉండటంతో రైతులు దీనిపట్ల ఆసక్తి చూపుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లోకి మధుమేహ నియంత్రణ బియ్యం వచ్చిందని పేర్కొంటున్నారు. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున మధుమేహ రోగుల్లో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరగకుండా చేస్తుంద ని, రోజుకు మూడు నాలుగుసార్లు ఈ బియ్యం తో వండిన అన్నం తీసుకోవచ్చంటున్నారు. కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించాలంటే కనీసం రెండు రాష్ట్రాల్లో నిర్ధరించిన కనీస విస్తీర్ణంలో ఈ పంట సాగు చేపడుతూ ఉండాలి. ఈ పంట దిగుబడిపై రైతులు సంతృప్తి చెందాలి. వీటన్నింటినీ కేంద్ర విత్తన కమిటీలోని డెరైక్టర్లు, శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి గుర్తింపునిస్తారు. హైదరాబాద్‌లో వచ్చే కమిటీ సమావేశాల్లో దీనికి గుర్తింపు వస్తుందని తెలంగాణ విత్తన సంస్థ అధికారులు చెబుతున్నారు.

 గ్లైసీమిక్ ఇండెక్స్ సూచిక 51.6..
 సాధారణ రకాల బియ్యాల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ సూచిక 55 పైనే ఉంటుందని, ‘తెలంగాణ సోన’ బియ్యంలో మాత్రం కేవలం 51.6 ఉంటుందని ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్.జగదీశ్ ‘సాక్షి’కి చెప్పారు. అందువల్ల మధుమేహంతో బాధపడే రోగులు ఎన్నిసార్లు తిన్నా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఈ రకం వరికి, బియ్యానికి కర్ణాటకలో అధిక డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో పెద్దగా ప్రచారం లేకపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు