త్వరలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీ

11 May, 2017 02:02 IST|Sakshi
త్వరలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీ

►  హైదరాబాద్‌లో నిర్వహణ.. వైఎస్సార్‌సీపీ నిర్ణయం
►  ముఖ్య అతిథిగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
►  రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 6 వేల మంది నాయకులతో నిర్వహిస్తాం
►  పది ప్రజా సమస్యలపై ప్లీనరీలో తీర్మానం చేస్తాం
►  ప్లీనరీ సన్నాహక సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 6 వేల మంది నాయకులతో త్వరలోనే హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించాలని వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ నిర్ణయించింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలు, తదితర ముఖ్యమైన పది అంశాలపై ఈ ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో మిర్చి, ఇతర పంటలు వేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని నిర్ణయించింది.

బుధవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్లీనరీ సన్నాహక సమావేశంలో పార్టీ అధ్య క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్య దర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మతీన్‌ ముజ్దా్దది, రాం భూపాల్‌రెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, జిల్లాల ఇన్‌చార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నా రు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతోపాటు, ప్లీనరీ ఏర్పాట్లు, చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు.

ప్లీనరీలో పది అంశాలపై తీర్మానం
దళితులకు మూడెకరాల పంపిణీలో వైఫల్యం, లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 10, 15 వేలు మాత్రమే భర్తీ చేయడం, పత్రికల్లో ఆర్భా టపు ప్రకటనలు, మీడియాలో పెద్దఎత్తున ప్రచారం తప్ప పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టక పోవడం, రెండు లక్షల డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, ఇప్పటికి కేవలం 1,600 మాత్రమే నిర్మించడం, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చేసిన పొరపాట్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపట్టకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరుగుతున్న నష్టాలపై సమావేశంలో చర్చించారు.

వీటి ఆధారంగానే ప్లీనరీలో పది అంశాలపై తీర్మానాలను రూపొందించాలని నిర్ణయిం చినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బం దుల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేయాలని ఈ సమావేశం డిమాండ్‌ చేసింది. మిర్చితో పాటు ఇతర పంటలు వేసిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలను చేపట్టాలని కోరింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు గజమాలతో ఘనంగా సన్మానించారు.

ప్రజా సమస్యలపై చర్చిస్తాం..: గట్టు
హైదరాబాద్‌లో జరగనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో రాష్ట్రంలోని ప్రజల సమస్యలతోపాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వా నించాలని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. త్వరలోనే ప్లీనరీ తేదీని ఖరారు చేస్తామన్నారు. సమావేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, పెండింగ్‌ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలపై ప్లీనరీలో పది తీర్మానాలు చేస్తామన్నారు. జూలైలో విజయవాడలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు