ప్రాణహితపై ప్రత్యేక అసెంబ్లీ

14 Feb, 2016 07:02 IST|Sakshi
ప్రాణహితపై ప్రత్యేక అసెంబ్లీ

నిర్వహించాలని షబ్బీర్ అలీ డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం రీ డిజైన్, మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై చర్చించడానికి వెంటనే ప్రత్యేక అసెం బ్లీ సమావేశాలను నిర్వహించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు, రూ.వేల కోట్ల తో ముడిపడి ఉన్న ప్రధాన అంశాలపై కూడా అఖిలపక్షంలో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని షబ్బీర్ హెచ్చరించారు.

కాళేశ్వరమా, తుమ్మిడిహెట్టియా, మరేదైనా కొత్త ప్రతిపాదన ఉందో తేల్చకుండా ప్రాణహిత-చేవెళ్లను జాతీ య ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రధాని మోదీని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.36వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్లకు పెంచారని, 110 శాతం పెంచడానికి కారణాలను ప్రజలకు వెల్లడించాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. కనీస నిబంధనలను పాటించకుండా కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను విడుదల చేసిందన్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్, ప్రతిపాదనలు పూర్తికాకుండానే నిధులను విడుదల చేసి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిధులను తీసుకుందని షబ్బీర్ అలీ ఆరోపించారు. వెబ్‌సైట్‌లో జీఓలు పెట్టకుండా దాదాపు 400 జీఓలను దాచిపెట్టారని, ప్రజలకు తెలియకూడని అంత రహస్యం ఏమున్నదని షబ్బీర్ ప్రశ్నించారు.

 జీవోల వెబ్‌సైట్ ఎలా ఎత్తేస్తారు: గుత్తా
 ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో పెట్టకుండా, వెబ్‌సైట్‌ను ఎలా నిలిపివేస్తారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. 11 సంవత్సరాలుగా ప్రభుత్వాలు జీఓలను వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పెడుతున్నాయన్నారు. ఈ సంప్రదాయాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని గుత్తా ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. 24 గంటల్లోగా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

 రహస్య ఎజెండా: పొంగులేటి
 జీఓల వెబ్‌సైట్‌ను నిలిపేయడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రహస్య ఎజెండా ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్‌ల పేరుపై ఉన్న ప్రాజెక్టుల పేరు మార్పును ఉపసంహరించుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు