ఖాకీలకూ ‘పనిష్మెంట్‌’

12 Aug, 2017 02:40 IST|Sakshi
ఖాకీలకూ ‘పనిష్మెంట్‌’

పోలీసు ఉల్లంఘనలపై ప్రత్యేక నజర్‌
సిబ్బంది, అధికారుల వయొలేషన్స్‌పై సీరియస్‌
తాజాగా కానిస్టేబుల్‌పై అటాచ్‌మెంట్‌ వేటు

సాక్షి, హైదరాబాద్‌: రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా, పాయింట్లు మాత్రమే పడుతున్నాయి. ఇదే పని పోలీసులు చేస్తే వారికి వీటితో పాటు తాఖీదులు తప్పట్లేదు. కొన్ని నెలలుగా నగర పోలీసులు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 242 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్‌ మెమోలు జారీ చేశారు. వీరిలో ఆరుగురిపై బదిలీ లేదా అటాచ్‌మెంట్‌ వేటు కూడా పడింది. హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ మీడియాకు చిక్కిన రామ్‌గోపాల్‌పేట కానిస్టేబుల్‌ కె.రాకేష్‌సాగర్‌ను సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ మధ్య మండల డీసీపీ జోయల్‌ డెవిస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే...
రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలున్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్‌ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్‌లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని కొత్వాల్‌ గతంలోనే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ రహదారుల పైనా పోలీసులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

యూనిఫాంలో ఉంటే సీరియస్‌...
నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్‌/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. వీరు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్‌ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌లు చేపట్టిన అధికారులు, కొన్నాళ్లుగా తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు.

నాలుగు రకాలుగా ఆధారాలు
పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుం టున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలి పారు. మొత్తం 4 రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నారు. విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషన రేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యు లేట్‌ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

తాఖీదులు పొందిన వారు ఇలా..
అదనపు ఇన్‌స్పెక్టర్‌                        1
ఎòౖÜ్సలు                                  66
హెడ్‌–కానిస్టేబుళ్లు                          9
కానిస్టేబుళ్లు                                86
హోంగార్డులు                                80
మొత్తం                                     242  


ముందు ఫైన్‌... ఆపై మెమో...
సేకరించిన ఫొటోలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరనేది నిర్ధారించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పష్టత వచ్చిన తర్వాత సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపు సంజాయిషీ ఇవ్వకపోయినా, ఇచ్చింది సం తృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్‌ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు