పేరుకే.. బాషా

13 Jul, 2014 00:05 IST|Sakshi
పేరుకే.. బాషా

నగరంలో.... మొత్తం ఆటోలు  - 1,20,000
రోజూ ఆటోల ద్వారా గమ్యం చేరే ప్రయాణికులు    -15,00,000
ఆటో ఆధారిత  కార్మికులు   -  2లక్షలకు పైగా
ఒక్కో ఆటో  రోజుకు సగటున తిరిగే దూరం - 100కి.మీ
మొత్తం ఆటోలు రోజుకు సగటున తిరిగే దూరం- 1కోటి కి.మీ పైమాటే


రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్‌లో ఒక ప్పుడు రిక్షావాలా జిందాబాద్ అయితే.. ఇప్పుడు ఆటోవాలా జిందాబాద్. మూడు చక్రాలు గిరగిర తిరిగితే మీటర్ జోరు చూసి ప్యాసింజర్ కళ్లు తిరుగుతాయి. అయినా సగటు మనిషి అర్జెంట్ పనుందంటే ఆటో అనే కేక వేస్తాడు. అంతలా నగర  జీవనంలో ఇమిడి పోయాడు ఆటోడ్రైవర్. ట్రాఫిక్ పద్మ వ్యూహంలో ఆటోను పాములా మెలికలు తిప్పుతూ ముందుకు నడిపిస్తాడు. ఈ గల్లీ ఆ గల్లీ అని తేడా లేకుండా ఇరుకైన సందుల్లో కూడా దూసుకెళ్తాడు. అయితే మాటల్లో కేర్‌లెస్.. చేతల్లో డేర్‌నెస్ స్పష్టంగా కనిపించే ఆటోడ్రైవర్ల జీవితం మాత్రం.. వాళ్ల మీటర్ తిరిగినంత హుషారుగా లేదు. మియాపూర్ నుంచి హయత్‌నగర్ వరకు.. ఉప్పల్ నుంచి మాదాపూర్ వరకు రయ్ రయ్ మనిపించినా.. కష్టాల సిగ్నల్స్ క్రాస్ చేయలేకపోతున్నాడు. చలాన్ల నుంచి తప్పించుకోలేక పోతున్నాడు. క్యాబ్స్ దెబ్బకు.. భారంగా గేర్లు మారుస్తున్న ఆటోవాలాను సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్ రూపంలో పోసాని కృష్ణమురళి పలకరించారు.
 
 
పోసాని కృష్ణమురళి: హైదరాబాద్‌కు ఎవరొచ్చినా ఫస్ట్ కనిపించేది మీరే.. పలకరించేది మీరే.. ఇంతకీ మీరెలా ఉన్నారు ?

లవకుమార్: చాలీచాలని బతుకులు. మూడు చక్రాలు తిరిగితేనే మా బండి నడుస్తది సార్. అదృష్టం బాగుంటే.. ఒక రోజు ఆటో అద్దె, పెట్రోలు ఖర్చు పోను రూ.400 మిగులుతాయి. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ ఎదురైతే.. ఆ నాలుగు వందలూ వారి జేబులోకే.

పోసాని కృష్ణమురళి: రోజంతా కష్టపడి ఉత్త చేతులతో ఇంటికి వెళ్లిన రోజులుంటాయా ?

శివ: ఎందుకుండవు సార్. ఆటో అద్దె మూడు వందలు, పెట్రోలు ఖర్చు నాలుగొందల వరకు ఉంటుంది. పైగా చలాన్లు. వచ్చేటప్పుడు బియ్యం తీసుకురా.. కూరలు తీసుకురా అని చెప్పిన భార్యకు వట్టి చేతులు చూపించిన రోజులు మాకు మామూలే.

పోసాని కృష్ణమురళి: బతుకు బండి నడిపించని ఆటోడ్రైవర్ ఉద్యోగం ఎందుకు ఎన్నుకున్నారు ? మరేదైనా చేసుకోవచ్చు కదా ?

రవి: మేమేమన్నా డిగ్రీలు చదివినమా సార్. ఇది కాకపోతే ఇంకోటి చూసుకోనికి. బయట ఏ డ్యూటీలకు పోయినా ఏడెనిమిది వేలకంటే ఎక్కువ రాదు. ఆ పైసలతో ఏం బతుకుతం.

పోసాని కృష్ణమురళి : ఎక్కడైనా కష్టం తప్పదు. ఇంతకీ పిల్లల్ని బాగా చదివిస్తున్నారా?

మోహన్: గవర్నమెంటు స్కూళ్లలో చేర్పించినం. వాళ్లు చదువుకునే దాన్నిబట్టి, మాకొచ్చే పైసలను బట్టి చదివిస్తం.

 పోసాని కృష్ణమురళి : ఒక పత్రికలో చదివాను.. ముంబైలోనో ఎక్కడో  ఆటోడ్రైవర్ కొడుకు పెద్ద చదువు చదువుకుని విదేశాల్లో ఉద్యోగం
సంపాదించాడని, మన హైదరాబాద్  ఆటోడ్రైవర్ ఎవరైనా తన బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూశారా?


లవకుమార్ : మాకంత సీన్ లేదు. పెద్దలిచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే తప్ప పిల్లల చదువులపైన శ్రద్ధ పెట్టేంత సంపాదన మాకు లేదు.
 
పోసాని కృష్ణమురళి: మీలో ఎంత మందికి సొంతిళ్లు ఉన్నాయి?

 లవకుమార్: చాలామందికి అద్దె ఇళ్లే. ఇందిరమ్మ ఇళ్లు వచ్చినాంక కొందరు ఆటో ఓనర్ కాకపోయినా, ఇంటికి ఓనర్ అయ్యిండ్రు.
 
పోసాని కృష్ణమురళి:  నిజమో.. అబద్ధమో పక్కన పెడితే, హైదరాబాద్‌లో ఆటోవాళ్లు చాలా హుషారు.. తెలివిగా లేకపోతే గల్లీలన్నీ తిప్పి జేబు గుల్ల చేస్తారంటారు! నిజమేనా.. ?

లవకుమార్: ఎవరో ఒకరిద్దర్ని చూసి మిగతావాళ్లందరినీ అదే గాటన కట్టేస్తే ఎలా సార్.
 రవి : రెండు లక్షల డబ్బున్న సంచి ఆటోలో మర్చిపోతే.. నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది కూడా ఆటోడ్రైవరే. ఓ పది రూపాయలు ఎక్కువడిగితే మాత్రం దేశమంతా ప్రచారం చేస్తారు.

  పోసాని కృష్ణమురళి : మంచి కంటే చెడుకు పబ్లిసిటీ ఎక్కువుంటుంది కదయ్యా. సరే.. మీలో ఎంతమంది నిజాయితీగా మీటరు వేసి ఆటో నడుపుతారు.
 రవి: అట్లా మాట్లాడాలంటే.. మీటర్ మీద వస్తున్న పైసలు మాకు ఒక్కపూట గడవడానికే వస్తున్నయి. ఆ రోజు చలానా పడిందనుకోండి.. ఆ పూటా పస్తే.
 ఎస్.కె.రహ్మత్: అయినా గిరాకీతో బేరం కుదిరితేనే కదా.. ఆటో ముందుకు కదులుతుంది.

 పోసాని కృష్ణ మురళి : మీరు షాపుకెళ్లి ఏదైనా సబ్బు కొనాలంటే దానిమీద ఉన్న రేటు ఇచ్చి కొంటారు కానీ, బేరం ఆడరు కదా ?
 శ్రీనివాస్: మీరు చెప్పేది కరెక్టే సార్. సబ్బుల షాపులకు గడి కీ చలాన్లు రాయరు కదా! వారి ఆదాయం మీద కూడా దోపిడీ చేసే వారుంటే ఇంకొన్ని పైసలు అడిగేవారు.

 పోసాని కృష్ణమురళి: మరి ఇలాంటి కష్టాలు ట్రాఫిక్ పోలీసులకు చెబితే ఏమంటారు?
లవకుమార్: వాళ్ల దగ్గర నోరు విప్పితే చలాన్ల సున్న పెంచుతరు.
 శివ: అమీర్‌పేటలో రాస్తరు, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు దగ్గర రాస్తరు, మల్ల జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర రాస్తరు. కష్టపడి సంపాదించిన సొమ్ము.. వాళ్ల చేతుల పెడుతుంటే ఏడ్చుడొక్కటే తక్కువ.

 పోసాని కృష్ణమురళి: మీ దగ్గర లెసైన్సులు కరెక్టుగా ఉండి, డ్రైవింగ్ బాగుంటే పోలీసులు మిమ్మల్ని ఎందుకు ఆపుతారు ?
 శ్రీనివాస్: లెసైన్సు, సిటీ పాస్, యూనిఫాం అన్నీ కరెక్టుగా ఉంటే.. ఒకరిని ఎక్కువ ఎక్కించుకున్నావ్ అంటరు. సిగ్నల్ జంప్ చేసినవంటరు. మొత్తానికి చలాన్ రాయనీకి వాళ్లు ఏదో ఒకటి సాకు చూపిస్తరు. అందుకే యూనిఫామ్‌లు కూడా సక్కగ ఏస్తలేం.

 పోసాని కృష్ణమురళి: మీరు రాత్రుళ్లు కూడా ఆటోలు నడిపిస్తరు కదా.. ?
 లవకుమార్: తప్పదు సార్. అప్పుడప్పుడూ పొద్దున, రాత్రి నడిపిస్తం. రాత్రి పైసలు ఎక్కువొస్తయి. చలాన్ల లొల్లి కూడా ఉండదు.

పోసాని కృష్ణమురళి: నగరంలో వేల మంది ఆటోవాళ్లున్నారు కదా.. మీ ఇబ్బందుల గురించి నాయకులకు ఎప్పుడైనా చెప్పారా?
 లవకుమార్: చెబితే ఎవరు పట్టించుకుంటరు సార్. సీఎం కాకముందు కేసీఆర్‌ను కలసి చెప్పినం. అధికారంలోకి వచ్చినాంక పోలీసోళ్ల ఇబ్బంది లేకుండా చేస్తమన్నరు. ఇప్పటి వరకూ మా మాటనే ఎత్తలేదు.  

పోసాని కృష్ణమురళి: సీఎం అయ్యాక కేసీఆర్‌ను కలిశారా?
 రవి: కలవలేదు.

పోసాని కృష్ణమురళి: కలవాలి కదా! అడక్కుండా అమ్మ కూడా అన్నం పెట్టదు. మీ యూనియన్ వారు ప్రభుత్వం దగ్గరికెళ్లి మీకు కావాల్సినవి అడగాలి. అవసరమైతే పోరాడాలి.
లవకుమార్: ఏం పోరాడుతాం సార్. ఎవరికైనా అవసరమైతే మాత్రం ఆటోలు బంద్ చేయమంటరు. మరి మా కోసం ఎవరైనా బంద్ చేస్తరా..! అంటే చరిత్రలో లేదు.
 
పోసాని కృష్ణమురళి: అది మాత్రం నిజం. అవును.. బంద్ టైంలో మీరు డబుల్ చార్జీలు వసూలు చేస్తారు.. .అది ఎంత వరకు న్యాయం.
 శ్రీనివాస్: ఎవరో ఒకరిద్దరు అలా చేస్తారు సార్.
లవకుమార్: చెయ్యక ఏం చేస్తరు. అప్పు చేయకుండా నెల ఎల్తలే సార్. ఆటో రిపేర్లు, ఇంట్లో వాళ్ల ఆస్పత్రి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజుల కోసం మూడు, నాలుగు రూపాయల వడ్డీకి అప్పుజేస్తం. బంద్ రోజైనా కడుపునిండా భోజనం తింటాం. ఆ ఒక్కరోజే మేము రాజులం సార్.

పోసాని కృష్ణమురళి: ఈ మధ్య క్యాబ్స్ దుమ్మురేపుతున్నాయి కదా.. మీ గిరాకీ దెబ్బతిందా..?
 రవి: క్యాబ్స్‌తో పెద్దింటోల్లు కాస్త దూరమయ్యారు సార్. అయితే అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే మాత్రం.. ఎవరికైనా గుర్తొచ్చేది ఆటోనే.

పోసాని కృష్ణమురళి : మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
 లవకుమార్:  గీ మాట చెప్తే.. రేపటి నుంచి మమ్మల్ని రోడ్లమీద తిరగనియ్యరేమో.. పోలీసోళ్ల గొడవ మాకు ఉండొద్దు. అట్లని  మా ఇష్టమొచ్చినట్లు నడ్వాలే అంటలేం. చలాన్లు లేకపోతే మేం ప్రశాంతంగా, పద్ధతి ప్రకారం ఉంటాం.

పోసాని కృష్ణమురళి: మీరు కోరుకునే రోజులు రావాలని మీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను.
 
 

మరిన్ని వార్తలు