వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

3 Feb, 2018 01:25 IST|Sakshi

టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు

సాక్షి, హైదరాబాద్‌: వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వస్త్ర పరిశ్రమల యజమానులు రాష్ట్రానికి తిరిగి రావాలని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ పరిశ్రమ భవన్‌లోని టీఎస్‌ఐఐసీ బోర్డు రూమ్‌లో తెలంగాణ నుంచి వలసవెళ్లిన షోలాపూర్, భీవండి చేనేత పరిశ్రమల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కొత్త యూనిట్లు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకంగా వస్త్ర పరిశ్రమ క్లస్టర్లను నెలకొల్పుతామని చెప్పారు. అంతేకాకుండా స్థలంతో పాటు సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలమల్లు సూచించారు. సమావేశంలో టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, చేనేతశాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్‌ నిమ్జ్‌ సీఈవో మధుసూదన్, వరంగల్‌జిల్లా మడొకిండ టెక్స్‌టైల్‌ పార్కు యజమానుల సంఘం అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు