'మెడాల్'కు మేత!

18 Aug, 2016 03:03 IST|Sakshi
'మెడాల్'కు మేత!

పరీక్షల పేరుతో ప్రైవేట్ సంస్థకు రోజుకు రూ.50 లక్షలు చెల్లింపు
ఏడాదికి రూ.180 కోట్లు.. మూడేళ్లకు రూ.540 కోట్లు

ఈ సొమ్ముతో అన్ని ఆస్పత్రుల్లో యంత్రాలు
సమకూర్చుకోవచ్చంటున్న అధికారులు
నిధులు గాలికి... ప్రైవేట్‌పైనే పాలకుల మోజు
రక్త పరీక్షల కోసం మెడాల్ మాయోపాయాలు
ఆ సంస్థ పరీక్షల ఫలితాలన్నీ తప్పుల తడకలే
ఫ్రాంజైజీలను అమ్ముకుంటున్న ప్రైవేట్ సంస్థ
అవసరం లేకపోయినా పరీక్షలు రాస్తున్న వైద్యులు

కాలు బెణికిందని ఆస్పత్రికి వెళ్తే మెదడుకు ఎమ్మారై స్కానింగ్ చేయించుకోమని వైద్యుడు చీటీ రాస్తే ఎలా ఉంటుంది?.. వాంతులతో బాధపడే వారిని వెన్నుపూస ఎక్స్‌రే తీయించుకోమని చెబితే ఏమనిపిస్తుంది?.. జబ్బొకటైతే ఔషధం వేరేదిస్తే రోగం నయమౌతుందా?.. సర్కారీ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ఓ సంస్థ తీరు అచ్చం అలాగే ఉంది.

సాక్షి, హైదరాబాద్/పార్వతీపురం/గుడివాడ టౌన్ : ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జి.శ్రీనివాసరావు గ్యాస్ట్రిక్ సమస్యతో ప్రభుత్వ ఆస్పత్రికెళ్లగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌తోపాటు అవసరం లేని మరికొన్ని పరీక్షలు రాశారు. మరోచోట కుక్క కరిచి ఆసుపత్రిలో చేరినా ఎనిమిది రకాల పరీక్షలు రాశారు. ఇంతేకాదు.. సాధారణ వైరల్ జ్వరాలకూ 10 రకాల టెస్టులు చేయించుకురావాలని పురమాయిస్తున్నారు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు?.. ఒక్క ‘మెడాల్’కు మేత పెట్టేందుకే! రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న మెడాల్ సంస్థకు దోచిపెట్టేందుకు ఇలా అడ్డగోలు రక్త పరీక్షలన్నీ రాస్తున్నారు. 

ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడం కోసం ఓ ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర సర్కారు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. రక్త పరీక్షల కోసం మెడాల్ అనే సంస్థతో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం రోజుకు అక్షరాలా రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అంటే ఏడాదికి రూ.180 కోట్లు... మూడేళ్లకు రూ.540 కోట్లు. ప్రభుత్వాసుపత్రిలో ఈసీజీ యంత్రం పాడైతే మరమ్మతుల కోసం కనీసం రూ.2 వేలు కూడా విదల్చని ప్రభుత్వం ఇలా ప్రైవేట్ సంస్థకు భారీగా నిధులు ఇస్తుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 లక్షల దండుకుంటున్న మెడాల్ సంస్థ కనీసం పరీక్షలనైనా సక్రమంగా చేస్తోందా? అంటే అదీ లేదు. ఆ సంస్థ నిర్వహస్తున్న పరీక్షల ఫలితాలు తప్పుల తడకలేనని తేలుతోంది.

కొందరు మంత్రుల బంధువులు, మాజీ నేతలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు మారి ప్రభుత్వ ధనాన్ని దోచుకుతింటున్నట్టు వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అసలు మెడాల్ చేస్తున్న వ్యాపారం దారుణమని రోజువారీ నివేదికలు అందుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పట్టణాల్లో రక్త పరీక్షల నిర్వహణను కొన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన మెడాల్ అమ్మేసుకుంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు స్థానిక నేతల కనుసన్నల్లో ఉండడంతో వారు మెడాల్‌పై ఈగ వాలనివ్వడం లేదు.  

రూ.100 కోట్లకు మించి అవసరం లేదు
రాష్ట్రంలో 32 ఏరియా ఆస్పత్రులు, 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రులన్నింటిలో రక్త పరీక్షల యంత్రాల ఏర్పాటు, నిర్వహణకు రూ.100 కోట్లకు మించి అవసరం లేదని నిపుణుల పరిశీలనలో తేలింది. ఆటో అనలైజర్, సెల్‌కౌంటర్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ ఇలాంటి పరికరాలన్నింటికీ కలిపి రూ.30 లక్షలు వెచ్చిస్తే చాలు. ఈ పరికరాలు ఏరియా, జిల్లా ఆస్పత్రులకు మాత్రమే అవసరం. పీహెచ్‌సీ స్థాయిలో అయితే రూ.5 లక్షలు వెచ్చిస్తే ప్రాథమిక పరీక్షలకు నిర్వహించవచ్చు. ఇది ఒకసారి పెట్టుబడి మాత్రమే.

ప్రధాన పరీక్షలన్నీ ఈ పరికరాలతోనే చేయచ్చు. ఇక నెలవారీ సిబ్బంది వేతనాలు, పరీక్షలకు కావల్సిన కిట్‌లు, రసాయనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి నెలకు రూ.1.50 లక్షలు మాత్రమే అవుతుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.180 కోట్లు అప్పనంగా చెల్లిస్తుండడం గమనార్హం. సొంతంగా రక్త పరీక్షలు నిర్వహిస్తే ఖర్చు భారీగా తగ్గి, నిధులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రజల సొమ్మును ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టడంపైనే పాలకులు శ్రద్ధ చూపుతున్నారు.
 

రోజుకు 21 వేల మందికి పరీక్షలు
రక్త పరీక్షల నిర్వహణ కోసం ఆరు నెలల క్రితం టెండర్లు పిలిస్తే మెడాల్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ దక్కేలా చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో రక్త నమూనాకు ప్రభుత్వం రూ.245 చొప్పున చెల్లించాలి. రోజుకు 12 వేల మంది రక్త నమూనాలు ఇప్పిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మెడాల్ సంస్థ రాష్ట్రంలో రోజుకు 21 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే ఒక్కో పరీక్షకు రూ.245 చొప్పున ప్రభుత్వం రోజుకు రూ.50.45 లక్షలు చెల్లిస్తోంది. కేవలం రక్త పరీక్షలకే రోజుకు అర కోటి చెల్లిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ సంస్థకు ఏడాదిపాటు చెల్లించే సొమ్ముతో రాష్ట్రంలోని 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తపరీక్షల కోసం అత్యుత్తమ యంత్రాలను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మూడు పువ్వులు.. ఆరు కాయలు
మెడాల్ వ్యాపారం ఆరు మాసాల్లోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. రక్త పరీక్షల కేసులు అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారం రూ.కోట్లలోకి చేరింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు కలెక్టర్లు కూడా మెడాల్‌కు ఇబ్బడిముబ్బడిగా రక్త పరీక్షల కేసులు రాయాలని వైద్యులకు ఆదేశాలిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 2016 జనవరి నుంచి మెడాల్ చేసిన రక్త పరీక్షలను చూస్తే వీరి వ్యాపారం ఏస్థాయిలో పెరిగిందో తెలిసిపోతుంది.

 నెల           మెడాల్ చేసిన టెస్టులు
---------------------------
జనవరి         940
ఫిబ్రవరి        81,755
మార్చి         1.77 లక్షలు
ఏప్రిల్          2.03 లక్షలు
మే                 2.62 లక్షలు
జూన్           2.80 లక్షలు

ఫ్రాంచైజీల లెక్కన అమ్మకం
ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మెడాల్ సంస్థ సొంతంగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ, స్థానిక డయాగ్నోస్టిక్ సెంటర్లతో మాట్లాడుకొని గుడ్‌విల్ కింద రూ.లక్షలు వసూలు చేసుకుని ఫ్రాంచైజీల లెక్కన అమ్ముకున్నారు. ఇలా ప్రతి జిల్లాలో ప్రైవేట్ ల్యాబ్‌లతో మాట్లాడుకొని నయాపైసా పెట్టుబడి పెట్టకుండా మెడాల్ సంస్థ దాదాపు రూ.25 కోట్లు వసూలు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఫ్రాంచైజీలు మెడాల్‌కు చెల్లించిన సొమ్మును రాబట్టుకునేందుకు డాక్టర్లకు విదేశీ పర్యటనల ఆఫర్లు ఇస్తూ ఎక్కువ సంఖ్యలో బ్లడ్ టెస్టులను రాయించుకుంటున్నాయి. మెడాల్‌కు మేలు చేసేందుకు అవసరం లేకపోయినా వైద్యులు రక్త పరీక్షలు రాస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.

వరదాయపాలెంలో మాయ
చిత్తూరు జిల్లా వరదాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు నాలుగైదుకు మించి రక్త పరీక్షలు జరగవు. గత రెండు నెలల్లో 90 టెస్టులు జరిగినట్టు పీహెచ్‌సీలోని రిజిస్టర్ నమోదైంది. కానీ, 250 టెస్టులకు పైగా జరిగినట్టు  కోర్ డ్యాష్‌బోర్డులో చూపిస్తున్నారు. అంటే ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ప్రమేయం లేకుండా మెడాల్ సంస్థే ఇష్టారాజ్యంగా టెస్టులు చేసుకుంటున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.

ఇదేమి కౌంట్.. మెడాల్
తప్పుడు నివేదికలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది మెడాల్ సంస్థ. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి చెందిన సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తికి సోమవారం పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో మెడాల్ సంస్థ రక్త పరీక్షలు నిర్వహించింది. ఆ సంస్థ రిపోర్టులో ప్లేట్‌లెట్ కౌంట్ 65,000గా ఉంది. అంత తక్కువగా కౌంట్ రావడంపై అనుమానం వచ్చి ఆయన ఆ రిపోర్టు వచ్చిన రెండు గంటల్లోనే పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్ రిపోర్టులో కౌంట్ 2,38,000గా ఉంది. బుధవారం ఏరియా ఆసుపత్రిలోని మెడాల్ సిబ్బందిని నిలదీయగా.. తమకేమీ తెలియదని, రక్తం తీసి పంపించేంతవరకే తమ పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 

4 గంటల తర్వాతే రక్త పరీక్షలు
వాస్తవానికి రక్త నమూనాలను సేకరించిన 2 గంటల్లోగానే ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించాలి. కానీ, ఉదయం 11 గంటలకు సేకరించి, సాయంత్రం 4 గంటలకు కూడా పరీక్షలు చేయడం లేదు. సాయంత్రం 4 గంటల వరకూ రక్తపరీక్షలు జరిగినట్టు చూపించడం లేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వేలల్లో పరీక్షలు జరిగినట్టు కోర్‌డ్యాష్ బోర్డులో చూపిస్తున్నారు. అంటే నాలుగైదు గంటల తర్వాత పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈలోగా రక్తం గడ్డకడుతోంది. దీంతో తప్పుడు రిపోర్టులు వస్తున్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.

ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం
‘‘రక్త పరీక్షల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రధానమైన హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ పరీక్షలు మెడాల్ ప్యాకేజీలో లేవు. అయినా ఇంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? ప్రస్తుతం రోజుకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు.  రేపు రూ.కోటి అవుతుందని ప్రైవేట్ సంస్థ చెబితే, ప్రభుత్వం చేతులెత్తేస్తే బాధ్యత ఎవరిది? రక్త పరీక్షలను ప్రైవేట్‌కు కట్టబెట్టకుండా ఆ డబ్బుతో ప్రభుత్వమే నిర్వహించాలి’’ - డా.గేయానంద్, ఎమ్మెల్సీ

మరిన్ని వార్తలు