కులవృత్తిదారులకు ప్రత్యేక శిక్షణ కేంద్రం

9 Apr, 2018 03:21 IST|Sakshi

త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం: జోగు రామన్న

సాక్షి, హైదరాబాద్‌: కులవృత్తిదారులను అభివృద్ధిబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులవృత్తిదారుల నైపుణ్యాభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

గతవారం గుజరాత్‌లో పర్యటించిన సందర్భంగా అక్కడి అనుభవాలు, రాష్ట్రంలో బీసీ కులాల కోసం కొత్తగా చేపట్టే కార్యక్రమాలను వివరించారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. అన్నిరాష్ట్రాల్లో ఉన్న కులవృత్తులకు సంబంధించిన భారీ ఎగ్జీబిషన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మట్టి గణపతులు, కొబ్బరినార గణపతులను మాత్రమే ఇక నుంచి ప్రోత్సహిస్తామని, దీనికి గుజరాత్‌లోని మాటికామ్‌ కళాకారి, మిట్టికూల్‌ సంస్థలతో ఎంవో యూ కుదుర్చుకుంటామని తెలిపారు. మిట్టికూల్‌ సంస్థ లాంతర్లు, కూలర్లు వంటి దాదాపు వంద రకాల మట్టి ఉత్పత్తులు చేస్తోందన్నారు. తాడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కుమ్మర వృత్తిదారులు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందన్నారు. గుజరాత్‌ తరహా మట్టిపాత్రల తయారీని తెలంగాణలో ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు