‘రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి’

30 Jul, 2016 19:24 IST|Sakshi

తాండూర్(రంగారెడ్డి): రాష్ట్రంలో ఏటా జరుగుతున్న వేలాది రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం తాండూర్ ఆర్టీసీ డిపోలో జరిగిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ.18కోట్లతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించనున్నట్లు వివరించారు. సురక్షితంగా వాహనాలను నడిపేలా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని అన్నారు.

ప్రమాదాల నివారణ లో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సురక్షిత ప్రయాణానికి అవసరమైన మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా లఘుచిత్రాలు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. అంతకుమునుపు ఆయన డిపోలో మొక్కలు నాటారు.

>
మరిన్ని వార్తలు