యూట్యూబ్‌లో చూసి.. యువకుడి ఆత్మహత్య

1 Sep, 2016 03:30 IST|Sakshi
యూట్యూబ్‌లో చూసి.. యువకుడి ఆత్మహత్య

* ఉద్యోగం రాలేదనే ఆవేదనతో బలవన్మరణం
* హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో ఘటన

హైదరాబాద్: ఆ యువకుడు కొన్నాళ్ల కింద ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.. ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం రాలేదు.. దీంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఆత్మహత్య చేసుకునే విధానాలపై యూట్యూబ్‌లో వెతికాడు.. వాటి నుంచి ప్రేరేపితుడై ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది.
 
ఆరు నెలలుగా..
నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన నర్సయ్య కుమారుడు నవీన్‌కుమార్ (26). బీటెక్ పూర్తి చేసిన నవీన్ ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఆరు నెలలుగాఎస్‌ఆర్‌నగర్‌లోని అనుపమ హస్టల్‌లో బెంగళూర్‌కు చెందిన మరో వ్యక్తితో కలసి ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఎన్ని సంస్థల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించకపోవడంతో ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో కూడా చెప్పుకొన్నాడు. ఈ ఆందోళనతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల కింద తన రూమ్మేట్ బెంగళూరుకు వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ సమయంలోనే ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే దానిపై యూట్యూబ్‌ను శోధించాడు.

చివరికి ఉరి వేసుకోవాలని నిర్ణయించుకుని.. ఓ తాడు కొనుక్కుని తెచ్చుకున్నాడు. మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని గదిలోకి వెళ్లాక.. ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి దీనిని గమనించి, హస్టల్ నిర్వాహకులకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. ఆ గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్య ఏ విధంగా చేసుకోవాలన్న దానిపై యూట్యూబ్‌లో వెతికానని నవీన్ సూసైడ్ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు కుటుంబ సభ్యులే కారణమని పేర్కొన్నాడని.. తల్లిదండ్రులను ప్రశ్నిస్తే పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు