కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు

13 May, 2016 03:42 IST|Sakshi
కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు

హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రతాప్ గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేయడం వల్ల ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు ఇస్తూ లేఖ పంపిందన్నారు. వర్సిటీలో ప్రస్తుతం వంద సీట్లు ఉండగా 2016-17 సంవత్సరానికి అదనంగా 50 సీట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఉద్యానవర్సిటీలో ఈ సంవత్సరానికి ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు 150 బీఎస్సీ హార్టికల్చర్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ ఆఫీసర్లు (హెచోఓ), హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(హెచ్‌ఈవో) ఉద్యోగాలు కల్పించేందుకు సానుకూలంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెదక్ జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు