ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియాలి

7 Feb, 2016 01:22 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
నగరంలో కన్నుల పండువగా వేంకటేశ్వర వైభవోత్సవాలు
ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 12 వరకు వేడుకలు

 
సాక్షి, హైదరాబాద్: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి భాగ్యనగరానికి రావడం మన అదృష్టమని, ఆయనను దర్శించుకునేందుకు నగరవాసులకు ఇది చక్కటి అవకాశమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు చక్కటి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారని, పరిపుష్టంగా, ఉత్కృష్టంగా సాగే ఈ వేడుకలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
 
టీటీడీ, హిందూధర్మ ప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించిన ‘శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు-2016’ అంకురార్పణకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాలుపంచుకున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.
 
ఆరు రోజుల పాటు జరుగను న్న ఈ వేడుకలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మందిరం, గుడి గోపురం, ఆలయ ప్రాంగణం, శ్రీలక్ష్మీ, భూదేవీ సమేతుడై కొలువుదీరిన ఏడుకొండలవాడి విగ్రహం భక్తజనసందోహాన్ని మంత్రముగ్ధులను చేశాయి.
 
వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన హర్ష టయోటా అధినేత హర్షవర్ధన్, ఆయన మిత్రబృందాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
 
భారత సంస్కృతి మహోన్నతమైంది
 కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మానవాళికి శాంతి, సుఖం, సౌభాగ్యం కలగడం కోసం యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు. ప్రజల్లో ధర్మ అనురక్తి పెరగడం కోసం, మనసుకు శాంతిని, సంకల్ప బలాన్ని అందజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.

సీఎం కేసీఆర్ మానవాళి శాంతి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇటీవలే అయుత చండీయాగం చేశారని ఆయన గుర్తు చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని, యావత్తు మానవాళి సంక్షేమం కోసం పాటుపడడం ఈ సంస్కృతి గొప్పతనమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేంద్రభారతి ప్రవచనములు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూ ర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు