రాజ్యాధికారంలో సగం వాటా ఇవ్వాలి

4 Feb, 2018 02:43 IST|Sakshi

బీసీ కమిషన్‌ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలి

అఖిలపక్ష కమిటీ సమావేశం డిమాండ్‌

హైదరాబాద్‌: దేశ జనాభాలో సగమున్న బీసీలకు రాజ్యాధికారంలో సగం వాటా కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు.

దీనికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నర్సింహయాదవ్‌ హాజరయ్యారు. పొన్నాల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో బీసీలు రాజీ పడవద్దని, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం దక్కేవరకు పోరాడాలని పిలుపిచ్చారు. సమాజంలో బీసీలకు ఆత్మ గౌరవం దక్కాలంటే రాజకీయ అధికారమే పరిష్కారమన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. బీసీ కమిషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదింపజేసి, క్రీమీలేయర్‌ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని వీహెచ్‌ కోరారు. బీసీ కమిషన్‌ బిల్లు పెడితే మొదటి ఓటు తానే వేస్తానని ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు.  

కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం
కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్‌లో పోరాడుతానని తెలిపారు. రాజకీయ పార్టీల రంగులు బయటపెట్టేందుకు 20వేల మంది బీసీ ప్రతినిధులతో మార్చి చివరి వారంలో బీసీ రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నట్లు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

త్వరలోనే బీసీ కుల సంఘాలతో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న 32 రాజకీయ పార్టీలను కలసి బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీడీపీ యువజన విభాగం నాయకుడు వీరేందర్‌ గౌడ్, సీపీఐ నేత రంగాచారి, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్‌ మల్లయ్య, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు