కల్తీ కేంద్రాలపై ఉక్కుపాదం

8 Jul, 2017 02:44 IST|Sakshi
కల్తీ కేంద్రాలపై ఉక్కుపాదం
- నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు దాడులు 
రూ.1.10 కోట్ల విలువైన సరుకు స్వాధీనం 
 
హైదరాబాద్‌: నగరంలోని కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాతబస్తీ, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం దాడులు జరిపారు. మొత్తం రూ.1.10 కోట్ల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, గుట్కా స్వాధీనం చేసుకున్నారు. పలువురుని అరెస్టు చేశారు. 
 
పాతబస్తీలో మిర్చి, మసాలా పౌడర్‌... 
పాతబస్తీ సంతోష్‌నగర్, ఛత్రినాక, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై శాంతిభద్రతలు, టాస్క్‌పోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. రూ.50 లక్షల విలువైన ఆహార పదార్థాలు, గుట్కా స్వాధీనం చేసుకున్నట్టు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ చెప్పారు. సంతోష్‌నగర్‌ రక్షాపురంలోని భవానీ ఏజెన్సీ నిర్వాహకుడు ఎ.సర్జయ్య నుంచి చక్రం బ్రాండ్‌తో ఉన్న 800 కిలోల కల్తీ మిర్చి, ధనియాల పొడి, పసుపు, ఏలకులు స్వాధీనం చేసుకున్నారు. మోయిన్‌బాగ్‌లోని మహ్మద్‌ ముజీబ్‌ ఉల్‌ రెహమాన్‌ ఆధ్వర్యంలోని రాయల్‌రోజ్‌ ఎంకేఆర్‌ ప్రొడక్ట్స్‌తో ఉన్న 70 కిలోల అల్లం–వెల్లుల్లి మిశ్రమం, వెల్లుల్లి, తయారీ సామాగ్రిని సీజ్‌ చేశారు. ఛత్రినాక పూర్ణచందర్‌ కేంద్రంపై దాడులు చేసి 98 పామాయిల్, డాల్డా డబ్బాలను, భవానీనగర్‌లోని మహ్మద్‌ గౌస్‌ ఖురేషీ, మహ్మద్‌ అంజద్, మహ్మద్‌ ఖాజా మోయినోద్దీన్‌ల నుంచి 20 కిలోల పశు వ్యర్థాలు, 45 కిలోల పశు వ్యర్థాలతో తయారు చేసిన నూనె స్వాధీనం చేసుకున్నారు.

చాంద్రాయణగుట్టలో సయ్యద్‌ రషీద్‌ నుంచి 2 గుట్కా తయారీ మిషన్లు, 150కి పైగా బ్యాగ్‌ల గుట్కా ముడిసరుకు, గుట్కా పౌడర్‌ సీజ్‌ చేశారు. బహదూర్‌పురాలోని డాక్టర్‌ హఫీజుల్లాఖాన్‌పై దాడి చేసి 25 లీటర్ల తేనె, మహ్మద్‌ రఫీక్‌కు చెందిన 150 కిలోల కల్తీ వంట నూనె స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పురాలో తేనె తయారీ కేంద్రాన్ని కూడా సీజ్‌ చేశారు. వీటన్నింటికీ సంబంధించి 9 మందిని అరెస్ట్‌ చేసి నట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. 
 
ఎల్‌బీనగర్‌లో రూ.60 లక్షల సరుకు స్వాధీనం
ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రీసాయి గ్రేడింగ్‌ వర్క్స్‌ నిర్వాహకుడు బన్నెల ప్రవీణ్‌(33)ను అరెస్టు చేసి, అతడి నుంచి 500కు పైగా బ్యాగ్‌ల మిర్చి పొడి, పసుపు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో ఆర్‌.కె.ట్రేడర్స్‌ సుల్తాన్‌ రతానీని అరెస్ట్‌ చేసి, 362 బస్తాల మిర్చి, కారం బ్యాగ్‌లు, తయారీ పరికరాలను సీజ్‌ చేశారు. బైరామల్‌గూడ వద్ద గోదాం నిర్వహిస్తున్న  తమ్మూరు బాయ్‌ నుంచి 400 కేజీలకు పైగా మిర్చి, కారం, చెక్క పొడి, డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాగర్‌రింగ్‌రోడ్డు ప్రకాశ్‌ సొసైటీలో బన్యాల ప్రవీణ్‌(33)... కారంలో చెక్కపౌడర్, ఆయిల్‌ కలిపి వివిధ బ్రాండ్ల పేరుతో సరఫరా చేస్తుండగా పోలీసులు గోదాంపై దాడి చేశారు. వీరి నుంచి 150 బస్తాల మిర్చి, 300 బస్తాల కారం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 
మరిన్ని వార్తలు