ప్రతిభను చూడాలి..అప్రధాన తప్పిదాలను కాదు

27 Dec, 2015 01:38 IST|Sakshi
ప్రతిభను చూడాలి..అప్రధాన తప్పిదాలను కాదు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టిన హైకోర్టు
 
 సాక్షి, హైదరాబాద్: సమాధానపత్రాల మూల్యాంకనం విషయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. పోటీ పరీక్షల్లో టెస్ట్ ఫాం నంబర్ (టీఎఫ్‌ఎన్) తదితరాలను బబ్లింగ్ (పెన్సిల్‌తో గళ్లను పూరించడం) చేయకపోవడం వంటి అప్రధాన తప్పిదాలను సాకుగా చూపుతూ ఏకంగా సమాధానపత్రం మొత్తాన్ని మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇలాంటి అప్రధానమైన తప్పిదాలతో ఎవరి సమాధానపత్రాలైతే మూల్యాంకనానికి నోచుకోలేదో, వారు న్యాయస్థానాలను ఆశ్రయించనప్పటికీ, వారి సమాధానపత్రాలు మూల్యాం కనం చేయాల్సిందేనని ఎస్‌ఎస్‌సీని ధర్మాసనం ఆదేశించింది.

 ఇదీ వివాదం..
 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌కు ఎస్‌ఎస్‌సీ 2014లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి విజయవాడకు చెందిన గూడూరు రాజ సూర్య ప్రవీణ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన మొదటి దశ పరీక్షలో 138 మార్కులతో 609 ర్యాంకు సాధించారు. ఢిల్లీలో జరిగిన రెండో దశ పరీక్షలో రెండు పేపర్లుంటే, మొదటి పేపర్‌లో 155 మార్కులు సాధిం చారు. రెండో పేపర్‌లో టెస్ట్ ఫాం నంబర్‌ను సరిగా బబ్లింగ్ చేయకపోవడం వల్ల మూల్యాంకనం చేయలేదని అధికారులు చెప్పారు. దీనిపై ప్రవీణ్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.

అతనికి అనుకూలంగా క్యాట్ తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పూర్తిస్థాయిలో వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. టెస్ట్ ఫాం నంబర్‌ను బబ్లింగ్ చేయకపోవడం సమాధానపత్రం మూల్యాంకనానికి ఏ విధంగానూ అడ్డుకాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కంప్యూటర్ ద్వారా నిర్దేశిత ప్రోగ్రాం ద్వారా సమాధానాలను మూల్యాంకనం చేస్తారే తప్ప, టెస్ట్ ఫాం నంబర్‌ను కాదన్నారు. ఈ కారణంతో మొత్తం సమాధాన పత్రాన్నే మూల్యాంకనం చేయకుండా పక్కన పడేయటం సరికాదని పేర్కొంది.
 
 కోర్టుకు రానివారికీ ఈ తీర్పు వర్తింపజేయాలి
 ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహణ లక్ష్యం పరీక్ష రాసిన వారిలో ప్రతిభావంతులనే ఎంపిక చేయడమే. ఇందులో భాగంగా ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కంప్యూటర్ ద్వారా మూల్యాంకనం చేయిస్తున్నారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే విషయంలో అభ్యర్థి ఆ సమాధానం గడిని పూరించనంత మాత్రాన మొత్తం సమాధాన పత్రాన్ని పక్కనపెట్టలేరు కదా. సాంకేతిక కారణాలతో పిటిషనర్ వంటి ప్రతిభావంతుడిని అడ్డుకోవడం సరికాదు. ఈ విషయంలో ఎస్‌ఎస్‌సీ నిర్ణయం సహేతుకమైంది కాదు. పిటిషనర్‌లాగే సమాధాన పత్రాలు మూల్యాంకనం విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ కోర్టుకు రాలేని అభ్యర్థులు ఎంతో మంది ఉంటారు.

న్యాయవాదులను పెట్టుకునే స్తోమత వారికి ఉండకపోవచ్చు. అయితే న్యాయం పొందడానికి ఇది ఎంత మాత్రం అడ్డుకాదు.  కోర్టుకు రాని అభ్యర్థుల విషయంలో పిటిషనర్‌కు ఇచ్చిన ఆదేశాలను ఎస్‌ఎస్‌సీ వర్తింపచేయాలి. అప్రధాన తప్పిదాలతో వారి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా పక్కన పెట్టి ఉంటే వెంటనే వాటిని మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించాలి.

మరిన్ని వార్తలు