జూలో సిబ్బందిపై జింకల దాడి!!

5 Jan, 2015 14:31 IST|Sakshi
జూలో సిబ్బందిపై జింకల దాడి!!

నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతు సంరక్షకులు (యానిమల్ కీపర్లు)గా పనిచేస్తున్న ఇద్దరిపై జింకలు దాడి చేశాయి. వాటికి కేటాయించిన ఎన్‌క్లోజర్‌ నుంచి జింకలను వదిలేందుకు గేట్‌ను తెరిచిన కృష్ణారెడ్డి, అక్బర్‌లపై జింకలు తిరగబడ్డాయి. ఈ సంఘటనలో తొలుత కృష్ణారెడ్డి జింకల కోపానికి గురయ్యాడు. అప్రమత్తమైన మరో కీపర్ అక్బర్ వాటిని నిరోధించేందుకు యత్నించడంతో అతనిపైనా కొమ్ములతో దాడికి దిగి ఓ చెట్టుకు గుద్దేశాయి. దీంతో అతనికి నడుము, కాలు భాగాలకు తీవ్రగాయాలయ్యాయి.

అదే సమయంలో ఇతరుల సహాయం కోసం ప్రయత్నించిన కృష్ణారెడ్డినీ గాయపరిచాయి. అక్కడికి చేరుకున్న తోటి జంతు సంరక్షకులు అక్బర్‌ను యశోదా ఆసుపత్రికి తరలించారు. వన్యప్రాణులను ఉదయం ఎన్‌క్లోజర్ల నుంచి విడిచి పెట్టి సాయంత్రం మళ్లీ ఎన్‌క్లోజర్‌లోకి పంపిస్తారు. ఇది జూలో రోజూ జరిగే ప్రక్రియ. జింకల నుంచి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని జూ సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని వార్తలు