రోడ్లు మూసేస్తే ధర్నా

6 Nov, 2015 01:21 IST|Sakshi

సబ్ ఏరియా  జీఓసీకి తేల్చి చెప్పాను
నసీరుద్దీన్ షా ఉర్సుకు ‘దారి’క్లియర్
ఎంపీ మల్లారెడ్డి వెల్లడి

 
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రతిపాదిత రోడ్లను మూసేస్తే తాను ధర్నాకు సైతం వెనుకాడేది లేదని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ-ఆంధ్రా సబ్‌ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్  (జీఓసీ)- ఇన్- చీఫ్ మేజర్ జనరల్ పచోరీని కలిశారు. ఈ భేటీలో కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అజయ్ సింగ్ నేగీ, కల్నల్ క్యూ అజయ్ కటోచీ తదితరులున్నారు. బోయిన్‌పల్లిలోని ప్రముఖ దర్గా నసీరుద్దీన్ షా బాబా దర్గాలో ఉర్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్మీ స్థావరాల నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగా రోడ్డు తెరిపించాల్సిందిగా మల్లారెడ్డి జీఓసీని కోరారు. ఇందుకు సమ్మతించి ఈ నెల 7 నుంచి 9 వతేదీ వరకు దర్గా వెళ్లేందుకు అనువుగా రోడ్డు మార్గాన్ని తెరిచేలా సంబంధిత కమాండర్‌కు జీఓసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓసీ రోడ్ల మూసివేతపై ఆసక్తి కరమైన చర్చ జరిగినట్లు ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ గుండా వెళ్లే రోడ్ల మూసివేతపై ఆర్మీ అధికారుల నిర్ణయం ఏంటని జీఓసీని అడగ్గా... ఈ మార్గంలో సాధారణ పౌరుల రాకపోకలపై నిషేధం విధించేందుకు తమకు కోర్టు అనుమతిచ్చినట్లు తెలిపారన్నారు.

ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి గాఫ్ రోడ్డు మూసేస్తున్నట్లు స్పష్టం చేశారని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను మానుకోవాలని సూచించగా ఉన్నతాధికారులు, లేదా మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే రోడ్ల మూసివేత నిర్ణయంలో మార్పు ఉంటుందని  పచోరీ పేర్కొన్నట్లు ఎంపీ వెల్లడించారు. తాను శుక్రవారం ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి రోడ్ల మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని కోరతానన్నారు.
 

మరిన్ని వార్తలు