సీఎస్ పదవీ కాలం పొడిగించండి

14 Jul, 2016 02:17 IST|Sakshi

మరో 3 నెలల గడువు ఇవ్వండి.. డీవోపీటీకి రాష్ట్రం ప్రతిపాదన
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు, కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ) బుధవారం ఈ ప్రతిపాదనలు పంపించారు. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌శర్మ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి  సీఎస్‌గా కొనసాగుతున్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం గత మే 31న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఇప్పటికే డీవోపీటీ ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 31 వరకు సర్వీసులో కొనసాగే వెసులుబాటు ఇచ్చింది. కొత్త రాష్ట్రం కావటంతోపాటు ఐఏఎస్‌ల కొరత ఉన్నందున పరిపాలనా ఇబ్బందుల దృష్ట్యా అనుభవమున్న రాజీవ్‌శర్మను మరికొంత కాలం సీఎస్‌గా కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
 
 అందుకే ఆరు నెలల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని గత ఫిబ్రవరిలోనే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవీ కాలాన్ని డీవోపీటీ మూడు నెలల పాటు పొడిగించినా.. మరోసారి ఈ గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే సీఎం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు సీఎస్ పదవీకాలాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 30వరకు రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు