రాష్ట్రంలో ఆహార భద్రతపై కేంద్రం దృష్టి

8 Jun, 2015 02:45 IST|Sakshi
రాష్ట్రంలో ఆహార భద్రతపై కేంద్రం దృష్టి

ఈ ఏడాదికి రూ. 89.42 కోట్లు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఆహార భద్రత మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ఏడాదికి గాను రూ. 89.42 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద రాష్ట్రం కూడా తన వాటా నిధులను సమకూరుస్తుంది. కేంద్ర నిధుల్లో వరి ఉత్పత్తి కోసం రూ. 34.04 కోట్లు, పప్పుధాన్యాల సాగుకు రూ. 46.45 కోట్లు కేటాయించారు.

వరి ఉత్పత్తి కోసం హెక్టారుకు రూ. 7,500 కేటాయిస్తారు. అలాగే భూసారాన్ని కాపాడటం, రైతుల వ్యక్తిగత ఆదాయాన్ని వృద్ధి చేయడం వంటి లక్ష్యాలను కూడా నిర్దేశించారు. అందుకోసం రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రణాళికను తయారుచేసింది. సాగునీటి వనరులు ఉండి ఉత్పాదకత తక్కువ ఉన్న ప్రాంతాలను, అలాగే వర్షాభావ ప్రాంతాలను కూడా గుర్తించాలని నిర్ణయించారు. ఉత్పాదకతను పెంచేందుకు క్లస్టర్లను ఏర్పాటు చేసి మిషన్ కార్యక్రమాలను చేపడతారు.

అలాగే ఈ మిషన్ కింద వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను రైతులకు వివరిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు నిధులను అందజేస్తారు. మిషన్‌లో భాగంగా రైతులకు 2,199 పంపుసెట్లను ప్రోత్సాహకంగా అందజేస్తారు. వాటి కోసం రూ. 2.19 కోట్లు కేటాయించారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రైతులకు అందజేస్తారు. మారుమూల ప్రాంతాల్లోని రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు