అందర్నీ కడుపులో పెట్టుకుంటం!

26 Sep, 2014 01:00 IST|Sakshi
అందర్నీ కడుపులో పెట్టుకుంటం!

ఆర్థిక సంఘానికి తెలంగాణ సర్కారు నివేదిక

* తెలంగాణ జనాభా 3.61 కోట్లు.. అందులో 61.88 లక్షలు వలస వచ్చిన వారే
* ఎవరికి కూడా పౌరసేవల్లో ఎలాంటి వివక్ష ఉండదు
* వలస వచ్చిన వారి కోసం సౌకర్యాల కల్పన రాష్ట్ర బాధ్యత
* హైదరాబాద్ నుంచి 3,000 మంది డీలర్లు వ్యాపారాన్ని ఏపీకి మార్చుతున్నారు
* తెలంగాణ పన్నుల ఆదాయం 42 నుంచి 44 శాతానికి మించే అవకాశం లేదు
* మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి

 
సాక్షి, హైదరాబాద్: ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి పౌరసేవల్లో ఎలాంటి వివక్ష ఉండదని తెలంగాణ ప్ర భుత్వం స్పష్టం చేసింది. వారంతా భారతీయులేనని, వలస వచ్చిన వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని 14వ ఆర్థిక సంఘానికి హామీ ఇచ్చింది. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతానికి వలసలు పెరిగాయని, తద్వారా జనాభా పెరుగుతూ వచ్చిందని వెల్లడించింది. ఇక్కడకు వస్తున్న వారందరికీ పౌర సౌకర్యాలు కల్పించ డం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. కానీ రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ఆదాయం గణనీయం గా తగ్గిపోనుందని, పెద్ద సంఖ్యలో వ్యాపారులు తరలిపోనున్నారని ఆర్థిక సంఘానికి తెలిపింది.  అధిక నిధులు ఇవ్వాలనిని విజ్ఞప్తి చేసింది.
 
వ్యయం పెరుగుతోంది..

రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ఆదాయం ఏ విధంగా తగ్గనుంది? ఇదే సమయంలో ప్రజలకు అందించాల్సిన సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకయ్యే వ్యయం పెరగడం వల్ల ప్రభుత్వంపై పడే భారం ఎంత? అనే అంశాలను ఆర్థిక సంఘానికి ప్రభుత్వం వివరించింది. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. తాజా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.61 కోట్లు కాగా.. అందులో సీమాంధ్ర నుంచి వచ్చినవారు 37.14 లక్షలని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 24.73 లక్షల మంది అని అధికారిక లెక్కలను నివేదికలో వెల్లడించింది.
 
‘2011’ ఆధారంగా నిధులివ్వండి
14వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు జనాభా ను ప్రాతిపదికగా తీసుకుంటున్నందున.. గతం లో మాదిరిగా 1971 జనాభా లెక్కలను కాకుం డా 2011 జనాభా లెక్కల ఆధారంగా నిధుల కేటాయింపు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 1971 నుంచి తెలంగాణకు వలసలు ఏ విధంగా పెరిగాయనేదానిని గణాంకాలతో సహా ఆర్థిక సంఘానికి వివరించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1971లో తెలంగాణ ప్రాంత జనాభా 37 శాతం ఉంటే, 2011 నాటికి 42 శాతానికి పెరిగిందని వెల్లడించింది. హైదరాబాద్ అన్ని రకాలా అనువైన ప్రాంతం కావడంతో ఆంధ్రాతోపాటు, వివి ధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడకు ఉపాధి కోసం వస్తున్నారని తెలిపింది. అలా వచ్చేవారిని నిరోధించడం అసాధ్యమని, వచ్చిన వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, పౌరసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. పన్నుల వాటా కేటాయింపు, గ్రాంటుల మం జూరుకు తాజా జనాభా లె క్కలను పరిగణనలోకి తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేసింది.
 
3 వేల మంది డీలర్లు వెళ్లిపోతున్నారు
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నవారు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాకు వెళ్లిపోతున్నారని ప్రభుత్వం పేర్కొంది. తద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేసింది. దాదాపు మూడు వేల మంది డీలర్లు తమ వ్యాపారాల కేంద్రాన్ని మార్చుకుంటున్నారని ఆర్థిక సంఘానికి వివరించింది.
    
ఇది రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందని, తద్వారా వ్యాట్ మాత్రమేగాక, స్టాం ప్స్‌అండ్ రిజిస్ట్రేషన్, మోటారు వాహనాల ప న్ను, ఎక్సైజ్ ఆదాయంలోనూ తగ్గుదల ఉంటుం దని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. తెలంగాణ ఆదాయం 42నుంచి 44 శాతం మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వివరించింది.

>
మరిన్ని వార్తలు