హస్తినలోనే తేల్చుకుందాం..!

15 Jan, 2018 01:38 IST|Sakshi

‘అకినేపల్లి’ అనుసంధానంపై 17న కేంద్రం వద్ద తాడోపేడో 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై హస్తినలోనే తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘అకినేపల్లి’బ్యారేజీ ద్వారా నీటి మళ్లింపు ప్రణాళికపై చర్చించేందుకు ఈ నెల 17న కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు అభ్యంతరాలు, అనుమానాలు, ఇతర ప్రత్యామ్నాయాల నివేదికలను తయారు చేశారు. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని ప్రతిపాదిస్తోంది.

అయితే దీనిని తెలంగాణ తప్పుపడుతోంది. అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా అవసరాలు పోనూ, 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు(289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉం టుందని అంచనా వేసింది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం ఎక్కువ జలాలున్నట్లు చూపడాన్ని తెలంగాణ ప్రశ్నిస్తోంది. 

మరిన్ని వార్తలు